calender_icon.png 2 October, 2024 | 5:58 PM

స్వరాష్ట్రమే ఊపిరిగా!

04-09-2024 12:00:00 AM

చరిత్రలో ఒక పదేళ్లు వెనక్కి వెళ్లి చూస్తే.. తెలంగాణ మలిదశ ఉద్యమ ఉధృతి ఎలా జరిగింది? ఎంతమంది ఉద్యమంలో పాల్గొన్నారు? ఎంతమంది ఉద్యమకారులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అమరులయ్యారు? ఆనాడు ఉద్యమకారులు ప్రజలను ఎలా చైతన్య పరిచారు అనే అంశాలు స్పష్టంగా అర్థం అవుతాయి. వరంగల్ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా విద్యార్థి సంఘాల ఐక్యతతో 2009లో మొట్టమొదటిసారి కాకతీయ యూనివర్సిటీలో జేఏసీ ఏర్పడింది. ఆనాడు వివిధ సంఘాల విద్యార్థి నాయకులు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని గుర్తించి.. ఉద్యమ ఆకాంక్షలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుల పోరాట అనుభవాలను విజయక్రాంతితో పంచుకున్నారు.   

మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ ఉద్యమాన్ని ఆసక్తిగా గమనించాయి. విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, వివిధ కులవృత్తులు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, కళాకారులు సకలజనులు ఏకమై సాగించిన వైవిద్యభరితమైన ఉద్యమంగా చరిత్రకెక్కింది. 2009 నుంచి 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొనేవరకు ఉద్యమం అనేక మలుపులు తిరిగింది. అనేక పరిణామాలు జరిగాయి. 

 రూప

ఉద్యమంలో నా వంతు పాత్ర..

నా పేరు డాక్టర్ గుగులోతు దేవోజి నాయక్. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాను. కీలకంగా పని చేయడమే కాక, జైలు జీవితంను అనుభవించాను. ఆనాటి టీఆర్‌ఎస్ అధినేత దొంగ ఆమరణ నిరహారదీక్ష విరమించుకోవడంతో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిలోకంను మేల్కొలిపి అర్ధరాత్రి 12 గంటలకు కేసీఆర్ శవయాత్రను కే.యూలో చేశాం. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు ఏ కాంపిటేటివ్ పరీక్షలు రాయమని, తెలంగాణ సాధించిన తరువాతనే గ్రూప్ పరీక్ష పెట్టాలని 4 సెప్టెంబర్ 2010న ఆమరణ నిరహార దీక్ష చేశాం.

2010, నవంబర్ 19న హనుమకొండలోని నయీంనగర్‌లో బస్సులు ధ్వంసం చేసిన కేసులో అరెస్టు జైలు జీవితం గడిపాను. 2011, జనవరి 10న కాకతీయ యూనివర్సిటీ ఎస్.డి.ఎల్.సి.ఇ వద్ద జరిగిన పోలీస్ లాఠిచార్జిలో గాయాలపాలై ఎంజీఎం హాస్పిటల్లో మూడు రోజులు చికిత్స పొందాను. అలాగే వై.యస్.జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రను, చంద్రబాబు నాయుడు తలపెట్టిన మహాపాదయాత్రను అడ్డుకోవడానికి విద్యార్థులను చైతన్యపరిచి తిరుగుబాటు ఉద్యమానికి నాయకత్వం వహించాను.

జాక్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యతిరేక రాజకీయ పార్టీల కార్యక్రమాలను అడ్డుకొని రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించడం జరిగింది. అప్పటి నుంచి నిత్యం, నిర్బంధాలు, అరెస్టులు, జైలుకెళ్లడం, పోలీస్ స్టేషన్లకు వెళ్లడం, అరెస్ట్ అవ్వడం మామూలైపోయింది. రైల్వే కేసులు, సివిల్ కేసులు అన్ని కలిపి సుమారుగా 56కి పైగా ఉన్నాయి. మొన్నటి దాక ఈ కేసులు కోసం కోర్టు చుట్టూ తిరిగాను. 2022లో ఈ కేసులను కొట్టివేయడం జరిగింది.

 డాక్టర్ గుగులోత్ దేవోజీ నాయక్

కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడు

ఉద్యమ ఊపు ఎక్కడ తగ్గలె!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైన తొలి రోజులవి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రకాలుగా, అన్ని రంగాల్లో తీవ్రమైన అణచివేతకు,  అన్యాయాలకు గురి అయ్యాం. నీళ్ల కోసం, ఉద్యోగాల కోసం, నిధుల కోసం పోరాటం చేశాం. తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రమైన అన్యాయానికి గురి అవుతున్నారని గుర్తించి ఉద్యమంలో పాల్గొన్నాను. కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప ఆకుపచ్చ తెలంగాణ సాద్యం కాదు.  ఆకలి బాధలు తీరి హాయిగా బతకాలంటే ప్రత్యేక తెలంగాణ ఒక్కటే మార్గం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నావంతుగా క్రియాశీలంగా పని చేశాను. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీలో ఆమరణ నిరహార దీక్ష చేశాం.

అది ప్రాణాలకు తెగించి.. ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా ఆమరణ నిరహార దీక్ష చేశాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆనాటి విద్యార్థి జేఏసీగా ఉన్న పిడమర్తి రవి ఆధ్వర్యంలో సమూహిక నిరహార దీక్ష చేశాం. గ్రూప్-2 వాయిదా వేయడమే కాదు.. ఆనాటి ప్రభుత్వంపై, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి.. తెలంగాణ రాష్ట్ర సాధనకు అనుకులంగా నిర్ణయం తీసుకునే విధంగా వాళ్లపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చాం. అదే విధంగా ప్రతి గడపగడపకు పాదయాత్ర, ప్రతి ఇంటికి తిరిగి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరమో? తెలంగాణ రాష్ట్రమోస్తే.. ఏ విధంగా నిధులొస్తయ్, ఏ విధంగా ఉద్యోగాలు వొస్తయ్ అని ప్రజలను చైతన్య పరిచాం.

అలాగే సీతంపేట, హసన్‌పర్తిలో రైలు పట్టాలను విరగొట్టాను, బస్సులపై పెట్రోల్ బాంబులు వేయడం, బస్సుల అద్దాలు పగలగొట్టడం, మిలియన్ మార్చ్‌లో హైదరాబాద్ ట్యాంక్‌పై విగ్రహాలను ధ్వంసం చేశాం. జిల్లాల్లో ఎమ్మెల్యేల, పోలీసు హెడ్ క్వాటర్స్ దగ్గర నిరసనలతో పాటు దిష్టిబొమ్మలను దహనం చేశా. పాలకుర్తి చంద్రబాబు ఘనటలో చంద్రదండు పేరుతో మా మీద దాడులు చేశారు. మేం ప్రతిఘటించి రాళ్లతో దాడి చేశాం. ఉద్యమ సమయంలో నాపై దాదాపు పది, పదిహేను క్రిమినల్ కేసులు, నలభై సివిల్ కేసులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కేసులు కొట్టివేడయం జరిగింది. ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి వారి అర్హతకు తగినట్టుగా నామినేటెడ్ పోస్టులు ఇస్తే బాగుంటుంది.   

 డాక్టర్ గణిపాక క్రాంతి కుమార్

కాకతీయ యూనివర్సిటీ జేఏసీ విద్యార్థి నాయకుడు 

మాపై తీవ్రంగా లాఠిచార్జి చేశారు! 

కాకతీయ యూనివర్సిటీలో జాక్‌లో నేను కో ఆర్డినేటర్‌గా పని చేస్తూ.. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పని చేశాను. తెలంగాణ వ్యాప్తంగా జరిగే ప్రతి ఉద్యమానికి కాకతీయ యూనివర్సిటీ కేంద్రం. జాక్ ఆధ్వర్యంలో మేం ఉద్యమంలో పాల్గొని రాస్తా రోకోలు, ధర్నాలు, నిరహార దీక్షలు, వంటవార్పు తదితర కార్యక్రమాల్లో రాష్ట్ర జాక్, యూనివర్సిటీ జాక్ కో ఆర్డినేటర్‌గా ఉద్యమం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 29 నవంబర్ 2009లో నా మీద పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు.

దానికి కారణం ఏందంటే కేసీఆర్ కరీంనగర్‌లో నిరహార దీక్ష చేస్తూన్న క్రమంలో కేయూ రెండో గేట్ వద్ద మేం నిరసన వ్యక్తం చేశాం. ఆ సమయంలో పోలీసులు మాపై లాఠీ చార్జి చేశారు. పోలీసుల దాడిలో నాకు తీవ్రమైన దెబ్బలు తగిలాయి. యూనివర్సిటీ విద్యార్థిగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో అవకాశం రావడం నిజంగా మంచి పరిణామం. ఉద్యమాన్ని ఉధృతి చేస్తున్న క్రమంలో బీసీ విద్యార్థి సంఘ వ్యవస్థాపకుడిగా ఉద్యమం చేశాను. 2009 సంవత్సరంలో మొదటిసారి జాక్ కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా ఏర్పడ్డది.

దాంట్లో నేను కో ఆర్డినేటర్ బాధ్యతలు నిర్వహించాను. అప్పుడు మొదటి జాక్ చైర్మన్‌గా వాసుదేవ్ రెడ్డి, వలి ఉల్లా ఖాద్రీ ఉన్నారు. ఆ సమయంలో విద్యార్థి సంఘాలైన పీడీఎస్‌యూ, బహుజన సంఘం డీబీఎస్, ఏబీఎస్‌ఎఫ్, బీసీ విద్యార్థి సంఘం, టీఆర్‌ఎస్ విద్యార్థి సంఘాలతో జాక్ ఏర్పాటు చేశాం. అలా   ఉద్యమాన్ని పలు ధపాలుగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదే విధంగా కేయూలో పోలికేక సభను ఆర్ట్ కాలేజీ గ్రాండ్‌లో విజయవంతం చేశాం.   

 డాక్టర్ ఎర్రబొజ్జు రమేశ్,

కాకతీయ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు,

జేఏసీ కో ఆర్డినేటర్