ఉదయం హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం
తిరుమలలో వైభవంగా సాగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు బుధవారం సాయంత్రం 7 గంటల నుం చి 9 గంటల వరకు స్వామివారు గజవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. అంతకు ముందు ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీకోదండ రాముడి అవతారంలో ధను స్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతుడిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
వాహ నం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
భాగవత అంతర్భాగమైన గజేంద్రమోక్షం ఘట్టంలో ఆ శ్రీహరి ఏనుగును కాపాడిన విధంగా, శరణు కోరే వారిని తాను సదా కాపాడుతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు గజ వాహనంపై ఊరేగుతాడని ప్రతీతి. గజ వాహనరూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా తొలగిపోతుందని శాస్త్ర వచనం.
గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన కలిగిన మహనీయులు కాబట్టి వాహకరూపంలో ఈ ఇరువురిని చూసినవారికి పుణ్య ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. వాహనసేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, టీటీడీ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.