calender_icon.png 14 November, 2024 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాసబ్ చెరువును మింగేస్తున్నరు?

31-08-2024 01:49:18 AM

499 ఎకరాల్లో.. 100 ఎకరాలకు పైగా కబ్జా

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 30 (విజయ క్రాంతి): హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మాసబ్ చెరువును అక్రమార్కులు మింగేస్తున్నారు. 300 ఎకరాలకు ఆయకట్టుగా ఉన్న ఈ చెరువు విస్తీర్ణం 499 ఎకరాలు. సుమారు 179 ఎకరాల పట్టా భూములు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నాయి. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 100 ఎకరాలకు పైగా చెరువు భూములను కబ్జా చేశారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

రాళ్లతో చెరువు స్థలాన్ని పూడ్చడంతోపాటు ఎఫ్‌టీఎల్‌లో పెదపెద్ద రాళ్లను నింపి చెరువును రెండు భాగాలుగా మార్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తుర్కయంజాల్‌లో దాదాపు 14 కాలనీల వరకు ఉంటాయి. నూతనంగా వెలిసిన కొన్ని వెంచర్లలో కుంటలు, నాలాలు కూడా కబ్జాకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. అక్రమార్కులకు గత ప్రభు త్వ పెద్దల అండ ఉండటంతో ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలకు అనుమతిలిచ్చారనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వంలో చెరువు కబ్జా విషయంపై రాష్ట్ర, జిల్లా స్థాయి ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

కబ్జా నుండి కాపాడుతాం

మాసాబ్ చెరువును కబ్జా చెర నుంచి కాపాడుతాం. ఈ విషయమై గతంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చెరువును పరిశీలించారు. కబ్జాదారులపై పీడీపీ యాక్ట్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదయింది. మూడు రోజుల క్రితం ఏసీపీ కూడా చెరువును పరిశీలించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాల విషయమై కలెక్టర్, హైడ్రాతో చర్చించి, తగు చర్యలు తీసుకుంటాం. తస్పీన్, ఇరిగేషన్ ఏఈ, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం

మాసబ్ చెరువును కాపాడాలి

మాసబ్ చెరువు  కబ్జా విషయంపై పలుమార్లు తుర్కయం జాల్ మున్సిపాలిటీ అధికారులకు, ఇరిగేషన్, గత ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. రాష్ట్ర, జిల్లా స్థాయి ఇరిగేషన్ అధికారులకు విన్నవించాం. అయినా ఫలితం మాత్రం శూన్యం. హైడ్రా ఆధ్వర్యంలో కబ్జా చెర నుంచి మాసబ్ చెరువు కాపాడాలి. కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి.

 బచ్చిగళ్ళ రమేష్, మాసబ్ చెరువు పరిరక్షణ కమిటీ చైర్మన్