calender_icon.png 2 October, 2024 | 4:03 AM

కంకరను మింగేస్తున్నారు!

02-10-2024 12:59:16 AM

పాలమూరు ప్రాజెక్టు నుంచి తరలింపు

పట్టించుకోని ఇరిగేషన్, మైనింగ్ అధికారులు

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం కోసం పంప్‌హౌజ్, సర్జ్‌ఫుల్ నిర్మాణాల ద్వారా వెలువడుతున్న బండరాళ్లను సంబంధిత కాంట్రాక్టర్లు ఒక చోటికి చేర్చగా వాటిని అక్రమార్కులు రాత్రికి రాత్రే టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరిస్తున్నారు.

పనుల వద్ద కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ అధికారులు, మైనింగ్ అధికారుల నిఘా లేకపోవడమే ఈ తంతుకు కారణమని తెలుస్తున్నది. 

మిగిలింది 5.37 కోట్ల మెట్రిక్ టన్నులే

ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ప్రాజెక్టులో వెలువడుతున్న ముడి కంకర అధికారుల లెక్క ప్రకారం మిగిలింది 5.37కోట్ల మెట్రిక్ టన్నులు మాత్రమేనని తేలింది. అయితే ప్రాజెక్టు మొత్తం 12 ప్యాకేజీలకుగానూ కొన్ని ప్యాకేజీల్లోనే పనులు వేగంగా సాగుతున్నాయి.

గత ఏడేళ్లుగా సాగుతున్న ఈ పనుల్లో నిరంతరాయంగా వెలువడుతున్న పెద్దపెద్ద బండరాళ్లు, నిర్మాణాలకు అవసరమయ్యే కంకర, ముడిరాళ్లు వంటివి అధికారులు చెప్పే మిగులు కంటే మరో నాలుగింతలు అధికంగానే అక్రమ తరలింపు జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మిగిలిన వాటికి కూడా సంబంధిత కాంట్రాక్టర్‌లు, ఇరిగేషన్, మైనింగ్ శాఖ అధికారుల సమన్వయ లోపం కారంణంగా రాత్రిళ్లు అక్రమంగా తరలింపు జరుగుతూనే ఉందన్న ఆరోపణలున్నాయి.

ఖద్దరు లీడర్ల పనే..

బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2015లో ప్రారంభించిన పాలమూరు ప్రాజెక్టు పనులను 21ప్యాకేజీలుగా ఆయా కంపెనీలకు కాంట్రాక్టు విభజించి పనులు అప్పజె ప్పారు. పనులు కూడా అంతే శరవేగంగా కొనసాగాయి. అయితే అండర్ గ్రౌండ్ టన్నె ల్, పంప్‌హౌజ్, ఓపెన్ కెనాల్‌లో వెలువడిన కంకర వంటి ముడి సరుకును కాం ట్రాక్టర్లు ప్రాజెక్టు పనులకు ఇరువైపులా కుప్పలుగా పోసి ఉంచారు.

ఇట్టి కంకరను కాంట్రాక్టర్లే సన్నని చూర్ణంగా మార్చి ప్రాజెక్టుకు అవసరమయ్యే పనులకు వినియోగించుకునేలా అనుమతించింది. కొందరు లీడర్లు ఈ కంకరను స్వలాభం కోసం అక్కడి నుంచి కంకర మిళ్లులకు, ఇళ్ల నిర్మాణాలకు తరలిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఫలితంగా కోట్లల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.

కాగా కంకర, బండరాళ్లు, బెందడి తదితర ముడిసరుకును అక్రమార్కులు అడ్డగోలుగా తరలించి సొమ్ముచేసు కున్నాక ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొంది. ప్రస్తుతం మిగిలిన 5కోట్ల 37లక్షల మెట్రిక్ టన్నుల ముడిసరుకును ప్రభుత్వ పనులకు వినియోగించునేందుకు చూడాలని యోచిస్తోంది. అందులో భాగంగానే మైనింగ్ శాఖ టెండర్లకు నోటిఫికిషన్ జారీ చేసినట్లు తెలుస్తోంది. 

భద్రత బాధ్యత మైనింగ్ శాఖదే

శ్రీపురం వద్ద సొరంగ మార్గం నుంచి వెలువడిన ముడి కంకర అక్రమ తరలింపు జరగకుండా సాధ్యమైనంత వరకు నివారించగలిగాం. పనుల నుంచి బయటికి తెచ్చి ఒక చోటికి చేర్చేవరకే మా బాధ్యత. పోసిన ముడిసరుకు అక్రమార్కుల నుంచి కాపాడే బాధ్యత మైనింగ్ శాఖదే. 

 రవీందర్, 

ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

మేము తరలించే దాకా వారిదే బాధ్యత

ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా వెలువడిన ముడిసరుకు, కంకర భద్రత బాధ్యత నిర్మాణ పనులు చేపడుతున్న కంపెనీ, ఇరిగేషన్ శాఖ అధికారులదే. మేము ఆ సరుకును వేళం ద్వారా ఇతరులకు విక్రయించి, అప్పజెప్పే వరకు పూర్తి బాధత్య వారిపైనే ఉంటుంది. 

 రవీందర్, మైనింగ్ శాఖ, 

ఏడీ, నాగర్‌కర్నూల్