calender_icon.png 16 January, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంటలనూ మింగేశారు!

06-09-2024 12:44:57 AM

  1. చిన్ననీటి వనరులనూ వదలని కబ్జాసురులు
  2. గత ప్రభుత్వ హయాంలో మితిమీరిన నాయకులు
  3. తెలిసినా పట్టించుకోని అధికార యంత్రాంగం
  4. ఉక్కుపాదం మోపాలని కోరుతున్న ప్రజలు

కరీంనగర్, సెప్టెంబరు 5 (విజయక్రాంతి): భూముల విలువ ఆకాశాన్ని అంటడంతో కబ్జాసురులు చిన్న నీటి వనరులను చెరపట్టారు. కరీంనగరానికి ఆనుకొని ఉన్న కొత్తపల్లి చెరువుతోపాటు కుంటలు కబ్జాలు గురయ్యాయి. బీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి రెండేళ్లలో కబ్జాల పర్వం విజృంభించింది. కొందరు బీఆర్‌ఎస్ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో చెరువులను, కుంటలను ఆక్రమించి ప్లాట్లు చేసి విక్రయించారు. కొత్తపల్లి మున్సిపాలిటీగా మారిన అనంతరం భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారుల కన్ను కొత్తపల్లి చెరువుపై పడింది. కొత్తపల్లి ఊర చెరువు శిఖం సర్వే నంబర్ 592లో 240.01 ఎకరాల్లో విస్తరించి ఉంది.

ఈ చెరువుకు ఉప్పరమల్యాల, వెదిర చెరువుల ద్వారా గొలుసుకట్టు ఆధారంగా వరదనీరు వస్తుంది. గతంలో ఈ చెరువు కింద 800 ఎకరాల పారకం ఉండేది. ప్రస్తుతం 200 ఎకరాలకు పడిపోయింది. కరీంనగర్ జగిత్యాల రోడ్డుపై ఎగువ భాగంలో ప్రధాన కెనాల్‌కు ఆనుకుని చెరువు మధ్యలో భూఆక్రమణ కొనసాగింది. చెరువుకు ఆనుకొని ఉన్న 68, 60, 670, 671, 672, 669 సర్వే నంబర్లలో ఆక్రమించిన స్థలం చూపిస్తూ ఇంటినెంబర్ల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం. అలాగే పూర్తి వాటర్ లెవల్‌కు ఆనుకొని ఏకంగా రెండు ఫంక్షన్ హాల్స్ వెలిశాయి. ఇప్పటివరకు 15 ఎకరాల మేర చెరువు శిఖం కబ్జాకు గురయింది. ఇంత జరుగుతున్నా అధికారులు చూసిచూడనట్టు వ్యవహరించడంతో కబ్జాల పరంపర కొనసాగింది. 

ఆక్రమించుకున్న భూములకు రైతుబంధు

కరీంనగర్ హైవేను ఆనుకొని ఉన్న కొత్తపల్లి చెరువు సంగతి అటుంచితే.. గ్రామాల్లోనూ కుంటల కబ్జాల పర్వం కొనసాగింది. మండలంలోని రాణిపూర్ సమీ పంలోని నిమ్మకుంట 15 ఎకరాలు విస్తరించి ఉండగా, 7 ఎకరాలు కబ్జాకు గురయింది. సర్వే నంబర్ 476లో 92.16 ఎకరాలు నద్దినాల వాగు కొత్తపల్లి నుంచి రేకుర్తి వరకు విస్తరించి ఉంది. ఇందులో కొందరికి పట్టాలు ఇవ్వడంతోపాటు కబ్జాలకు గురయింది. మొత్తం 47.43 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్టు తెలుస్తోంది.

ఆక్రమించుకున్న భూములకు కొందరు రైతుబంధు పొందుతుండటం అధికారుల పనితీరుకు నిదర్శనం. సర్వే నంబర్ 275లోని దేవునికుంట 5.33 ఎకరాలు ఉండగా 20 గుంటల వరకు కబ్జాకు గురయింది. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి వెనుకవైపు ఉన్న స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారు. కొత్తపల్లి మున్సిపాలిటీగా ఏర్పడిన అనంతరం ఈ కబ్జాల పరంపర పెచ్చరిల్లింది. హైడ్రా తరహాలో కరీంనగర్‌లో కాడ్రాను ఏర్పాటు చేసి భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.