calender_icon.png 12 January, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంచరాయిని మింగేశారు?

12-01-2025 12:00:00 AM

  • ఎనిమిది ఎకరాలను కబ్జా చేసిన అక్రమార్కులు
  • రెండు గ్రామాలను కలిపే నక్ష బాటనూ వదల్లే..
  • అధికారులు, రాజకీయ పెద్దల సహకారం?

జనగామ, జనవరి 11 (విజయక్రాంతి): రెండు గ్రామాల శివారులోని ఎనిమిది ఎకరాల బంచరాయి భూమి కబ్జాకు గురైంది. రెండు ఊర్ల రైతులు అనాదిగా ఈ బాట వెంటే రాకపోకలు సాగించేవారు. అకస్మాత్తుగా ఆ బాట మాయమై పొలాలు కావడంతో ఆందోళన చెందుతున్నారు. జనగామ మండలం అడవికేశ్వాపూర్ గ్రామ శివారులో, నర్మెట మండలం బొమ్మకూరు గ్రామంలోని సర్వే నంబర్ 70/1 పరిధిలో ఎనిమిది ఎకరాల బంచరాయి భూమి ఉంది.

ఈ భూమి తమ పేరున ఉన్నదంటూ ఏడాది నుంచి కొందరు వ్యక్తులు సాగు చేసుకుంటున్నారు. రికార్డుల్లో తమ పేర్లే ఉన్నాయని, తమ వద్ద పాస్‌బుక్‌లు ఉన్నట్లు వారు చూపుతున్నారు. అయితే వారు చూపే భూమి వేరే చోట ఉండగా, సాగు చేస్తున్నది మరో చోట అని రికార్డులను పరిశీలిస్తే తెలుస్తోంది. 

అమలుకాని హైకోర్టు తీర్పు

ఎనిమిది ఎకరాలు కబ్జాకు గురవడంతో గతంలో అక్కడ ఉన్న నక్ష బాట కూడా తొలగిపోయింది. ఈ విషయమై ఓ రైతు హైకోర్టును ఆశ్రయించగా నక్ష బాటను యథాస్థితిగా అక్కడే తీయాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అధికారులు పెడచెవినా పెట్టినట్లు ఆరోపణలున్నాయి.

ఉత్తర్వులను ధిక్కరిస్తూ కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే మరో చోట జేసీబీల సాయంతో నక్ష బాటను తీశారు. దీంతో అమాయక రైతులు తమ పంట పొలాలను కోల్పోవాల్సి వచ్చింది. ఆ పొలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు తమ స్థలంగా నమ్మిస్తూ సాగు చేస్తున్నారు. ఈ తతంగంపై పలువురు రైతులు అధికారులను సంప్రదిస్తున్నా పట్టించుకోవడం లేదు. అధికారులు, పోలీసులు కూడా అక్రమార్కులకే వంత పాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. 

కలెక్టరేట్‌లో ఫిర్యాదు

బొమ్మకూరు పరిధిలోని సర్వే నంబర్ 70/1లో కబ్జాకు గురైన ఎనిమిది ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ మాలోత్ కిషన్‌నాయక్ కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఏవో మన్సూరీకి వినతిపత్రం అందజేశారు. అక్రమార్కుల తతం  వల్ల అమాయక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.

భూమి కబ్జాకు భారీ స్కెచ్

ఎలాగైనా పంచరాయి భూమిని కబ్జా చేయాలని భావించిన అక్రమార్కులు అతి తెలివి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. 2007  అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బొమ్మకూరులో జలాశయం నిర్మించేందుకు భూసేకరణ చేపట్టింది. అందులో భాగంగా 70/9, 70/11, 70/12, 70/13 సర్వే నంబర్లలో ఉన్న భూములను ప్రభుత్వం భూసేకరణ చట్టం కింద తీసుకుంది. ఇందుకు గానూ భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కూడా అందజేసింది.

ఈ భూములు పూర్తిగా జలాశయంలో కలిసిపోయి ప్రభుత్వ భూమిగా మారిపోగా.. అక్రమార్కులు సదరు సర్వే నంబర్లను ఆసరాగా చేసుకున్నారు. అంతకుముందు ఆ సర్వే నంబర్లలో ఉన్న రైతుల పేర్లు తొలగిపోగా.. ఆ స్థానంలో అడవికేశ్వాపూర్ గ్రామానికి చెందిన కొందరు తమ పేర్లను ఎక్కించుకున్నట్లుగా సమాచారం.

2011లో కొందరు రెవెన్యూ అధికారులను బుట్టలో వేసుకుని జలాశయంలో కలిసిపోయిన సర్వే నంబర్లపై తిరిగి తమ పేర్లు ఎక్కించుకుని అక్రమంగా పట్టా పుస్తకాలు పొందినట్లు తెలిసింది. ఆ సర్వే నంబర్లలో తమ పేర్లు ఉండగా, వాటిని అడ్డం పెట్టుకుని 70/1 సర్వే నంబర్‌లో ఉన్న బంచరాయి భూమిని కబ్జా చేశారు. భూమిని ఆక్రమించాలని చూస్తున్న వారి వెనుక ప్రభుత్వ అధికారులతో పాటు బడా రాజకీయ నేతల అండదండలు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.