calender_icon.png 12 October, 2024 | 12:46 AM

చెత్త నిర్వహణతోనే ‘స్వచ్ఛభారత్’

09-10-2024 12:00:00 AM

‘స్వచ్ఛభారత్’ కార్యక్రమం మొదలై ఇప్పటికి ఒక దశాబ్దకాలం పూర్తయింది. ఈ నినాదం ఒకింత సత్ఫలితాలను ఇచ్చిందనే చెప్పాలి. ‘స్వచ్ఛత’ కేవలం ప్రభుత్వ పని మాత్రమే కాదు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సాధ్యమని అందరూ తెలుసుకోవాలి. పరిసరాల పరిశుభ్రతపైనేకాక తలసరి చెత్త ఉత్పత్తిని తగ్గించే విధం గా కూడా మన చర్యలు ఉండాలి. మనం తరచూ వాడి పారేసే కాగితాలు, దుస్తులు, ప్లాస్టిక్ కవర్లు, గాజు, పింగాణి వస్తువులు, రేకు లేదా ప్లాస్టిక్ డబ్బాలు, గ్లాసులు, మూతలు మొదలైన వాటిపై దృష్టి పెట్టాలి.

దేశంలో అధిక చెత్తలో ఇవే ముఖ్యమవుతున్నాయి. అవసరమైన మేరకే వీటిని ఉపయోగించి, తర్వాత వాటిని తగిన విధంగా రీసైక్లింగ్‌కు సహాయపడాలి. తెల్ల కాగితాలను ఇరువైపులా ఉపయోగించాలి. వ్యర్థమైన కాగితాలను ఉండలు చుట్టి పారేయకుండా చక్కగా నిల్వ చేయాలి. నెలకు ఒకసారి చిత్తు కాగితాలను అంగడికి చేర్చాలి. దుస్తులను పేదలకు పంచి పెట్టవచ్చు.

వ్యర్థ ప్లాస్టిక్, గాజు వస్తువులు, రేకు డబ్బాల వంటివి వేరు చేసి చెత్త సామాన్ల దుకాణాలకు చేర్చాలి. ఇలాంటి విభజనవల్ల బయట పారవేసే చెత్త పరిమాణం తగ్గుతుంది. అటుపై చెత్త సామాన్ల వాళ్ళు ప్లాస్టిక్, గాజు, లోహపు చెత్తను తిరిగి వినియోగంలోకి తెచ్చే పరిశ్రమలకు తరలిస్తారు. దీనివల్ల ఒక క్రమపద్ధతిలో స్వచ్ఛ వాతావరణానికి బీజం పడుతుంది. ‘స్వచ్ఛభారత్’లో వాయు, శబ్ద, నీటి కాలుష్యం తగ్గించటానికి కూడా ప్రాధాన్యత పెంచాలి. ప్రజలమంతా ఈ దిశగా కదిలినప్పుడే భారతదేశం పూర్తి స్వచ్ఛభరితం అవుతుంది. 

 కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్