calender_icon.png 3 October, 2024 | 4:50 PM

స్వచ్ఛ భారత్ అంటే దేశ శ్రేయస్సు

03-10-2024 12:31:27 AM

స్వచ్ఛత కోసం ప్రజలంతా కలిసి రావాలని పిలుపు

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: స్వచ్ఛ్ భారత్ మిషన్ పరిశుభ్రత కార్యక్రమం మాత్రమే కాదని, ఉద్యోగాలు కల్పించి పేదలు, మహిళల గౌరవాన్ని అందించిన శ్రేయస్సు సాధనమని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. స్వచ్ఛ్‌భారత్‌ను ప్రారంభించి పదేండ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారతీయుల దృఢ సంకల్పానికి ఇది నిదర్శమని పేర్కొన్నారు.

గాంధీజీ జయంతిని పురస్కరించుకొని ప్రారంభించిన స్వచ్ఛభారత్‌కు పదేండ్లు పూర్తికావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఓ స్కూల్‌లో విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ నిర్వహించారు. చీపురు పట్టి స్కూల్ పరిసరాలను శుభ్రం చేశారు. స్వచ్ఛభారత్‌లో ప్రజలు సైతం పాల్గొనాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. ‘నేను, నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛ అభియాన్‌లో భాగమయ్యా.

మీరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా. ఈ చొరవ స్వచ్ఛభారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది’ అని మోదీ తన ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు పలువురు రాజకీయ నాయకులు స్వచ్ఛ అభియాన్‌లో పాల్గొన్నారు. కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, రాజీవ్‌రంజన్, ముఖేశ్ మాండవీతో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.