నవంబర్‌లో పెరిగిన కార్ల అమ్మకాలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీలు) అమ్మకాలు జోరుగా సాగడంతో నవంబర్ నెలలో ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు మారుతి సుజుకి ఇండియా, టాటా మోటార్స్, టొయోటా కిర్లోస్కర్ మోటార్‌లు పాసింజర్ కార్ల విక్రయాల్లో వృద్ధిని సాధించగలిగాయి. ప్రస్తుతం నడుస్తున్న పెండ్లిళ్ల సీజన్, గ్రామీణ డిమాండ్ కొనసాగుతున్నందున వాహన విక్రయాలు వృద్ధిచెందినట్లు ఆయా కంపెనీలు ఆదివారం ప్రకటించిన గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నది.
మరోవైపు స్టాక్ మార్కెట్లో కొత్తగా లిస్టయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు మాత్రం నవంబర్ నెలలో క్షీణించాయి. కార్ల విభాగంలో మార్కెట్ లీడర్ అయిన మారుతి సుజుకి దేశీయ పాసింజర్ కార్ల హోల్‌సేల్ అమ్మకాలు నిరుడు నవంబర్‌తో పోలిస్తే 5 శాతం వృద్ధిచెంది 1,34,158 యూనిట్ల నుంచి 1,41,312 యూనిట్లకు పెరిగాయి. ఈ నవంబర్‌లో హ్యుందాయ్ మోటార్స్ హోల్‌సేల్ అమ్మకాలు 2 శాతం క్షీణించి 49,451 యూనిట్ల నుంచి 48,246 యూనిట్లకు తగ్గాయి.
టాటా మోటార్స్ దేశీయ పాసింజర్ వాహన అమ్మకాలు ఎలక్ట్రిక్ కార్లతో సహా 2023 నవంబర్‌కంటే 2 శాతం పెరిగి 46,068 యూనిట్ల నుంచి 47,063 యూనిట్లకు చేరాయి. ఇదేరీతిలో టొయోటా కిర్లోస్కర్ మోటార్ వాహన విక్రయాలు 44 శాతం వృద్ధితో 17,818 యూనిట్ల నుంచి 25,586 యూనిట్లకు పెరిగాయి. జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ హోల్‌సేల్ విక్రయాలు 20 శాతం వృద్ధితో 6,019 యూనిట్లకు పెరిగాయి.
కలిసొచ్చిన పెండ్లిళ్ల సీజన్, గ్రామీణ డిమాండ్
పెండ్లిళ్ల సీజన్ డిమాండ్, రూరల్ మార్కెట్ డిమాండ్, ఎస్‌యూవీలు అమ్మకాలు బాగా పెరిగినందున నవంబర్ నెలలో మొత్తంగా వాహన విక్రయాల్ని పెంచుకోగలిగామని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాత్రో బెనర్జీ తెలిపారు. గత ఏడాదికంటే గ్రామీణ ప్రాంత అమ్మకాలు 2.2 శాతం పెరిగాయన్నారు. అయితే పట్టణ మార్కెట్లలో మాత్రం అక్టోబర్‌లో కనపడినంత జోరు నవంబర్‌లో చూడలేదని చెప్పారు.
పట్టణ వినియోగదారులు సాధారణంగా సంవత్సరాంతపు ఆఫర్ల కోసం డిసెంబర్ నెలకు కొనుగోళ్లు వాయిదా వేసుకుంటారని బెనర్జీ అభిప్రాయం వ్యక్తం చేశారు. నవంబర్ నెలలో తమ కార్ల పోర్ట్‌ఫోలియోలోఎస్‌యూవీల అమ్మకాలు 29 శాతానికి చేరాయన్నారు. మారుతి యుటిలిటీ వాహనాలైన బ్రెజ్జా, ఎర్టిగా, గ్రాండ్ వితారా, ఎక్స్‌ఎల్6 అమ్మకాలు ఈ నవంబర్‌లో 49,016 యూనిట్ల నుంచి 59,003 యూనిట్లకు పెరిగాయి.
మినీ కార్ల విభాగంలోని ఆల్టో, ఎస్‌ప్రెసో, అమ్మకాలు 9,959 యూనిట్ల నుంచి 9,750 యూనిట్లకు తగ్గాయి. బలెనో, సెలెరియో, డిజైర్, స్విఫ్ట్, టూర్ ఎస్, వ్యాగన్ ఆర్ తదితర కాంపాక్ట్ కార్ల అమ్మకాలు కూడా 64,679 యూనిట్ల నుంచి 61,373 యూనిట్లకు తగ్గాయి.
గ్రామీణ మార్కెట్లలో అత్యధిక అమ్మకాలు సాధించాం
ఇంతవరకూ ఏ నెలలో లేనంతగా నవంబర్‌లో గ్రామీణ ప్రాంతాల్లో అ త్యధికంగా విక్రయించామని, తమ మొత్తం అమ్మకాల్లో గ్రామీణ మార్కెట్ వాటా 22.1 శాతానికి చేరిందని హ్యుం దాయ్ మోటార్ తెలిపింది. తమ ఎస్‌యూవీల విక్రయాల జోరు నవంబర్ లోనూ కొనసాగిందని, మొత్తం దేశీ య అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 68.8 శాతానికి పెరిగినట్లు హ్యుందా య్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ వెల్లడించా రు.
హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ఎస్‌యూవీల వరకూ వివిధీకరించిన తమ పోర్ట్‌ఫోలియో వినియోగదారులను ఆకర్షించినట్లు టొయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ చెప్పారు. తమ ఎలక్ట్రిక్ క్రాసోవర్ యుటిలిటీ వెహికిల్ విండ్సర్ అమ్మకాలు వరుసగా రెండో నెలలోనూ పటిష్టంగా ఉన్నాయని, 3,144 యూనిట్లను విక్రయించినట్లు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ తెలిపింది.