calender_icon.png 24 October, 2024 | 7:47 AM

సుట్టు ముట్టూ సూర్యాపేట.. నట్టనడుమ నల్లగొండ

17-09-2024 04:45:45 AM

సూర్యాపేట, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటంలో సూర్యాపేట పాత్ర మారువలేనిది. ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతవ్ కొడుకో నైజాము సర్కరోడా..’ అని దొరల గుండెల్లో గుబులు లేపిన బండి యాదగిరి ఈ ప్రాంతం వాడే. శత్రుమూకలు తుపాకులతో కాల్పులు జరుపుతుండగా.. దళ సభ్యులు దిక్కు తోచక ఉండిపోతున్న సందర్భంలో.. తన చురకత్తుల్లాంటి మాటలతో దళాల నెత్తురు మండించి పోరాటానికి ఉసిగొల్పిన పండు ముసలితాతా ఈ ప్రాంతం వాడే. ఆ ఘటన ఆత్మకూర్ (ఎస్) మండలం కోటపహాడ్‌లోనే జరిగింది.

పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం సైతం ఇదే జిల్లాలో జరిగిన సాయుధ పోరాటంలో భాగస్వామురాలైంది. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన దళ సభ్యులను నాటి రజాకార్లు కాల్చి చంపారు. అలాగే మంచినీళ్ల బావి ఘటనలో 18 మంది అమరులయ్యారు. ఆత్మకూర్ (ఎస్)కు చెందిన దళ సభ్యుడు గుణగంటి నరసయ్యతో పాటు అతడికి కొరియర్‌గా పనిచేసిన గిలకత్తుల వెంకటయ్యను రజాకార్లు చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. సాయుధ పోరాటంలో ప్రజల్లో చైతన్యం రగిలించిన గోపాల్‌రెడ్డిని నైజాం ప్రభుత్వం మట్టుపెట్టింది. హుజూర్ నగర్ తాలూకా మల్లారెడ్డిగూడెంపై నిజాం సైన్యం లెవీ గల్లా పేరుతో దాడి చేసింది. దాడుల్లో బింద్రాల గురువమ్మ, బొండమ్మ, అంకాళమ్మ మృతిచెందారు. వీరు తెలంగాణ పోరాటంలో అమరులైన తొలి దళిత మహిళలు.

మానని ‘గుండ్రాంపల్లి’ గాయం

నల్లగొండ: నిజాం పాలనలో రజాకార్ల నరమేధానికి ప్రత్యేక సాక్ష్యం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామం. సాయుధ పోరాటంలో ఇక్కడి అనేక మంది పోరాట యోధులు ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత ఏపూరు, ఆరెగూడెం, పలివెల, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె గ్రామాలకు చెందిన యువకులు గ్రామ రక్షణ దళాల్లో చేరి సాయుధ శిక్షణ తీసుకున్నారు. రజాకార్లు సమారు 30 మంది యువకులను ఎడ్లబండ్లకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు.

వారిని బావిలోకి తీసేసి సజీవ దహనం చేశారు. దీంతో రగిలిపోయిన గ్రామస్తులు రజాకార్లపై తిరగబడ్డారు. నాటి పోరాటానికి గుర్తుగా తర్వాత గ్రామస్తులు స్మారక స్తూపం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ జరుగుతుండగా 2012లో ఈ స్తూపాన్ని తొలగించి మరోచోట నూతనంగా ఏర్పాటు చేశారు. నాటి గుండ్రాంపల్లి సజీవ ఘటనను గుర్తుచేసుకుని ఇప్పటికీ గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతారు. చరిత్రలో ఆ ఘటన మానని గాయంగానే మిగిలిపోయింది.

ధీర వనిత మల్లు స్వరాజ్యం

తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం కీలక పాత్ర పోషించారు. ఆయుధం పట్టి ప్రత్యక్షంగా పోరాటంలో భాగస్వామి అయ్యారు. ఆమె స్వగ్రామం ఇప్పటి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామం. పోరాటంలో ఆమె ఎస్టీలను భాగస్వాములను చేసింది. జానపద బాణీలో పాటలు కట్టి జనాన్ని జాగృతం చేసింది. ఈమె సోదరుడే భీమిరెడ్డి నరసింహారెడ్డి. ఆయన ఉత్తమ పార్లమెంటీరియన్ కూడా. ఈయన కూడా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. పోరాటంలో యువతను భాగస్వాములను చేశారు.