calender_icon.png 9 November, 2024 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ఆసుపత్రికి సుస్తీ

09-11-2024 12:00:00 AM

  1. పేరుకే పెద్దాసుపత్రి, సేవలు అంతంతమాత్రంమే
  2. సూర్యాపేటలో సమయపాలన పాటించని వైద్య సిబ్బంది
  3. సొంత ఆసుపత్రులకు రిఫర్!
  4. వేధిస్తున్న మందుల కొరత

సూర్యాపేట, నవంబర్ 8 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పటల్ సమస్యలకు నిలయంగా మారింది. సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోజు వందలాది ఓపీలు వస్తున్నా వైద్య సేవలు అందడం లేదనే ఆరోపణలు వెలువడుతున్నాయి.

గత కొన్ని రోజులుగా మందుల కొరత వేధిస్తున్నది. అంబులెన్స్‌లు మొరాయిస్తున్నాయి. సీనియర్ డాక్టర్లు నామమా త్రంగానే హాజరవుతూ జూనియర్ డాక్టర్‌లతో వైద్యం చేయిస్తున్నారు. చేయి చూసి, నాడి పట్టకుండానే మందులు రాసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నా యి. పేషెంట్లకు అందించే ఆహారంలో కూడా నాణ్యత లేదని తెలుస్తున్నది. 

నాడీ పట్టకుండానే వైద్యం

సూర్యాపేట జనరల్ ఆసుపత్రిఇకి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి ప్రతి రోజు అన్ని విభాగాలకు కలిపి 500 నుంచి 600 వరకు ఓపీ వస్తుంది. రోగి చేయి పట్టి నాడీ చూడకుండానే మందులు రాస్తున్నట్టు తెలుస్తున్నది. రెండు, మూడు సార్లు తిరిగితే వైద్య పరీక్షలకు రాస్తున్నారని, లేదా ప్రైవేటుగా వారు నిర్వహిస్తున్న ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారని పలువురు రోగులు చెబుతున్నారు.

ఇక్కడ అన్ని రకాల వైద్యానికి డాక్టర్లు అందుబాటులో ఉండటమే కాకుండా వైద్య కళాశా లకు అనుసంధానంగా ఆసుపత్రి నడుస్తోంది. ఆయా విభాగాలకు ఉన్న సీనియర్ డాక్టర్లు నామమాత్రంగా ఉంటూ, జూనియర్లతో వైద్యం చేయిస్తున్నారని తెలుస్తున్నది. వారు కూడా సమయపాలన పాటించడం లేదని సమాచారం. 

మందులకూ ఇబ్బందే

ఆసుపత్రిలో డాక్టర్లు రాసే మందుల్లో సగానికి పైగా మందులు బయట కొనాల్సిన పరిస్థితి ఉంది. ఏవైనా టెస్టులు రాస్తే అందుకు వినియోగించే సిరంజ్ కూడా బయటే కొనాల్సిన దుస్థితి నెలకొన్నది. డెలివరీ, ఇతర ఆపరేషన్ల సమయంలో  డాక్టర్లు, నర్సులు, సహాయకులు వినియోగించే చేతి గ్లౌజులు సైతం రోగుల సంబంధికులే బయట నుంచి కొని తీసుకువస్తున్నారు. 

తనిఖీలు చేసినా మారని తీరు

జిల్లా కలెక్టర్‌గా తేజస్ నందలాల్ పవార్ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ప్రభుత్వ హాస్పటళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఉన్న పీహెచ్‌సీలు, ఇతర ప్రభుత హాస్పటల్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సైతం ప్రతి వారం తనిఖీ చేస్తున్నారు. అయినా డాక్టర్ల తీరు మారడం లేదు. 

ప్రైవేటు మెడికల్ దుకాణాలతో కుమ్మక్కు?

ప్రభుత్వ డాక్టర్లు  ప్రైవేటు మెడికల్ దుకాణదారులతో కుమ్మక్కై నట్టు ప్రచారం జరుగతున్నది. జిల్లా ఆసుపత్రిలో మందుల కొరతను సాకుగా చూపి, అందుబాటులో లేని మందులను రాస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసు పత్రికి ఎదురుగా ఉన్న రెండు మెడికల్ దుకాణాల్లో మాత్రమే అందు బాటులో ఉన్న మందులను డాక్టర్లు రాయడమే కాకుండా ఆ మెడికల్ దుకాణాల విజిటింగ్ కార్డులను రోగుల బంధువులకు ఇచ్చి, తెచ్చుకోవాలని చెబుతున్నారు.

కొన్ని సం దర్భాల్లో ఆసుపత్రిలో పని చేసే సెక్యూరిటీలు, ఇతర సిబ్బందే దగ్గరుండి ఈ మెడికల్ దుకాణాల వద్దకు తీసుకెళ్తున్నారు. మెడికల్ దుకాణాలను రిఫర్ చేస్తున్నందుకు వైద్యులకు భారీగా ముడుపులు అం దుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ హాస్పటల్‌లో ఉచితంగా అందించే మం దులు హాస్పటల్ ఎదురుగా ఉన్న మెడికల్ దుకాణాల్లో విక్రయిస్తున్నారని సమాచారం.