18-03-2025 12:00:00 AM
కన్నోజు శ్రీహర్ష :
రాష్ట్ర ప్రభుత్వం 2025-2-26 బడ్జెట్ దాదాపు రూ. 3 లక్షల కోట్ల వరకు ఉం టుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న హైదరాబాద్ నగర అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. గ్లోబల్ స్థాయి నగరాల సరసన హైదరాబాద్‌ను నిలబెట్టడానికి ఒక వ్యూహాత్మక ప్రణాళిక తప్పని సరి.
తెలంగాణ రాష్ట్ర జనాభాలో దాదాపు 45 శాతం హైదరాబాద్- రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ‘నీతి ఆయోగ్’ విడుదల చేసే ‘సిటీస్ యాజ్ ఇంజిన్స్ ఫర్ ఫ్యూచర్ గ్రోత్’ నివేదికలో ‘తెలంగాణ రాష్ట్రం వచ్చే 2045 నాటికి 55 శాతం నగర జనాభాను కలిగి ఉంటుందని’ అంచనా వేశారు.
అంతటి భారీ జనాభాకు కనీస వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. భవిష్యత్తు దృష్ట్యా హైదరాబాద్ నగరానికి భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరం కుతుబ్ షాహీల కాలం నుండి నేటివరకు అభివృద్ధి చెందుతున్నది. పాలకులు మారినా హైదరాబాద్ మాత్రం ఆయా ప్రభుత్వాల విధానాల మేరకు వికాసం చెందుతూ ఉంది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నగరం రూపురేఖలు బాగా మారిపోయాయి. అయినా, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎన్నో కొత్త సవాళ్లను నేడు రాజధాని మహానగరం ఎదుర్కొంటున్నది. నగర నిరుద్యో గం, చుట్టూ పక్కల జిల్లాలనుండి భారీ వలసలు, అదే పనిగా వస్తున్న వరదలు, పెరిగే ఉష్ణోగ్రతలు వంటి విప్పత్తులు ప్రతి ఏడూ సంభవిస్తున్నాయి.
దీనికి తోడు నగరంలో భారీగా ట్రాఫిక్ సమస్య నెలకొని ఉంది. అనేక అండర్ పాసులు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నప్పటికీ పెరుగుతున్న జనాభాతో ట్రాఫిక్ నియంత్రణ కష్టమవుతున్నది. ఇప్పటికీ కొన్ని శివారు ప్రాంతాల్లో నీటి కొరత లాంటివి నగరంలో కొత్త సవాళ్ళను సృష్టిస్తున్నది.
వీటన్నింటినీ సమర్థం గా ఎదుర్కొని, ప్రజలకు సానుకూల పూర్తి సానుకూల పరిస్థితులను కల్పించడానికి ప్రభుత్వం భారీ మూల పెట్టుబడి నిధులను అందించాల్సిన అవసరం ఉంది. ప్ర భుత్వ, -ప్రైవేట్ భాగస్వామ్యంతో పలు రకాల ప్రాజెక్టులను పూర్తి చేయవలసి ఉంటుంది. ఈరోజు మన నగరం వియ న్నా, బెల్జియం, సింగపూర్, కైరో వంటి రాజధానులకు పోటీగా నిలువనుంది.
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల కోసం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైదరాబాద్ నగర అభివృద్ధిని కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకువెళుతున్నది. అందులో భాగంగానే నగర శివారులను కలుపుతూ మహానగరంగా మార్చాలని భావిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)తో మహానగర భౌగోళిక పరిమాణా న్ని విస్తరించి దానికి అనుసంధానం చేయనున్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు వెలుపల హైదరాబాద్ మహానగరాన్ని రూరల్, సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాలుగా నోటి ఫై చేయనున్నట్టు తెలుస్తున్నది. భవిష్యత్తులో పెరిగే జనాభాను దృష్టిలో ఉంచు కొని కనీస వసతులైన తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక వసతుల వికేంద్రీకరణ కోసం అద్భుత ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ మహానగర జనాభా దాదాపు 1.6 కోట్లు వుండగా, ఇది మరో పదేళ్ల (2035)కు 2 కోట్లకు చేరవచ్చు. ప్రభుత్వ ప్రణాళికల్లో ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన మరో ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ. హైదరాబాద్ నగరానికి నైరుతి దిశలో దీనిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. భారీ నిర్మాణాలు, హోటళ్లు, విశ్వవిద్యాలయాల కల్పన జరగగలదని ప్రభుత్వం భావిస్తున్నది.
భవిష్యత్తు హైదరాబాద్ అభివృద్ధి మరింతగా విస్తరించాలంటే ఫ్యూచర్ సిటీలో మాత్రమే ఎక్కువగా నిర్మాణాలు సాధ్యమయ్యేలా ప్రభుత్వం ముందుకు వెళుతున్నది. ఈ సరికొత్త నగర ప్రణాళికల కోసం ప్రభుత్వం ఎఫ్‌సీడీఏ (ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో మరో భారీ ప్రాజెక్టు మెట్రో రైలు.
దాదాపు 72 కి.మీ. మెట్రో రైలు ‘ఫేజ్-2’ని నిర్మాణానికీ ప్రభుత్వం యోచిస్తున్నది. ఫ్యూచర్ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధాని స్తూ, నగరంలోని మిగిలిన ప్రాంతాలను కలుపుతూ మెట్రో ‘ఫేజ్--2’ నిర్మాణం జరగాల్సి ఉంది. ఫ్యూచర్ సిటీలో పోలీస్ విశ్వవిద్యాలయం, స్కిల్ యూనివర్సిటీ, హెచ్‌ఐసీసీ లాంటి భారీ కన్వెన్షన్ సెంటర్ల స్థాపన తప్పనిసరిగా నిపుణులు భావిస్తున్నారు.
భవిష్యత్తులో అంతర్జాతీయ కాప్ (సీఓపీ), జీ20 సదస్సులు, ఒలంపిక్స్ వంటివి నిర్వహించే ఆలోచనలూ ఉన్నా యి. ఈ అన్ని ప్రణాళికల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనే భారీగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. నగరంలో తరచూ లోతట్టు ప్రాంతాలు నీట మునగడం, పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటుండడం చూస్తున్నాం.
ఇలాంటి విపత్తుల దీర్ఘకాలిక నిర్ములన స్మార్ట్ పద్దతిలో జరగాలి. రొబోటిక్ పద్ధతిలో ఏఐ సాంకేతికతను ఉపయోగించుకోవాల్సి వస్తుంది. మూసీ సుందరీకరణ పనులు సైతం చేసినట్టయితే, నగరం ఒక కొత్త రూపును సంతరించుకుంటుంది.
భారీ కేటాయింపులు అవసరం
దేశంలోనే భారీగా ఆదాయాన్ని చేకూర్చే మహానగరాల్లో ఒక్కటి హైదరాబాద్. రాష్ట్ర ప్రభుత్వం తరచూ కేంద్రానికి మెట్రో, ఫ్యూచర్ సిటీ నిర్మాణాల గురించి ఎంత విన్నపించుకుంటున్నా వారినుంచి కనీస సహకారం లభించట్లేదు. అసలు ‘కేంద్రం అవసరం లేకుండానే మన రాష్ట్ర బడ్జెట్, హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయంతోనే మెట్రో, తదితర నిర్మాణాలు సాధ్యమే’ అనికూడా పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఒక సహకార పద్ధతిలో కేంద్రంతో ముందుకు వెళదామని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించవలసి ఉంది. రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం రూ. 60 నుండి 80 వేల కోట్లు వచ్చే 3--4 సంవత్సరాల వరకు కేటాయింపులు చేస్తే, ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంతో అనుకున్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసుకోవచ్చు. ఎస్‌పీవీ (స్పెషల్ పర్పస్ వెహికిల్) నిధులు, మున్సిపల్ బాండ్స్‌ద్వారా నిధుల సేకరణ సులభతరం అవుతుంది.
టీడీఆర్ (ట్రాన్ఫరేబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) కింద నిర్మాణాలు చేపడితే ఎలాంటి సమస్యలు లేకుండా త్వరగా పూర్తవుతాయి. ప్రభుత్వం ముందుకు వచ్చి దుబాయ్ తరహాలో ఒక కన్వెన్షన్ నిర్మిస్తే అనేక అంతర్జాతీయ సమావేశాలతో భారీ ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు.
ఈ విధంగా నూతన మహానగర నిర్మాణానికి ఎలాంటి సమస్యలు లేకుండా, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణాలు పూర్తి చేయవచ్చు. రాష్ట్రంలో ఈ విధంగా భారీ ప్రణాళికలను ఒక వ్యూహంతో పూర్తి చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థలో హైదరాబాద్ నగర వాటా దాదాపు 10 శాతం వరకు ఉండగలదనికూడా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.