- మూడు నెలలుగా కిట్ల సరఫరా బంద్
- కొనసాగింపుపై ప్రభుత్వం నుంచి రాని స్పష్టత
మెదక్, జూలై 19 (విజయక్రాంతి): పుట్టబోయే శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉండాలం టే గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఉండొద్దనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన న్యూట్రిషన్ కిట్లకు ప్రస్తుతం గ్రహణం పట్టింది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణులకు అందించే న్యూట్రిషన్ కిట్ల పంపిణీ గత మూడు నెలలుగా నిలిచిపోయింది. సరఫరాను నిలిపివేయడంతో గర్భిణులకు పౌష్టి కాహారం అందడం లేదు. మాతా,శిశు మరణాలను తగ్గించడంతో పాటు సాధారణ ప్రసవాలు పెంచాలని గత ప్రభుత్వం ఈ కిట్ల పంపిణీని ప్రారంభించింది. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారిం ది. తర్వాత మూడు నెలల పాటు న్యూట్రిష న్ కిట్లు పంపిణీ చేశారు.
ఆ తర్వాత నిలిపివేశారు. పౌష్టికాహార కిట్ల కోసం గర్భిణులు వైద్యులను సంప్రదించగా ఎప్పుడు వస్తా యో చెప్పడం లేదు. గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు సైతం న్యూట్రిషన్ కిట్లను సరఫరా చేశారు. తర్వాత పూర్తిగా నిలిపివేసి కేవలం మాతా,శిశు ఆసుపత్రులకు మాత్రమే సరఫరా చేశారు. మూడు నెలలుగా అవి కూడా రావడం లేదు. అయితే, కొనసాగింపుపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని సమాచారం.
రెండుసార్లు అందజేత..
గర్భిణులలో పౌష్టికాహార లోపం నివారించేందుకు రెండుసార్లు కిట్లను అందిం చేది. పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారికే వీటిని పంపిణీ చేయాలని నిర్ణయిం చింది. ఈ మేరకు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేరు నమోదు చేసుకున్న గర్భిణులకు 12 నుంచి 26 వారాల్లోపు కిట్లను అందించారు. రెండో కిట్‌ను ప్రసవం కోసం వెళ్లే కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాతా, శిశు ఆరోగ్య కేంద్రాల్లో 24 నుంచి 34 వారాల్లోపు అందించేవారు.
కిట్లలో ఉండేవి ఇవే..
మొదటి కిట్‌లో మదర్ హార్లిక్స్, ఖర్జూరా ప్యాకెట్, ఐరన్ సిరప్ బాటి ళ్లు, నెయ్యి, పల్లీపట్టి ప్యాకెట్లు, కప్పును ఒక బాస్కెట్‌లో పెట్టి అందించారు. రెండో కిట్‌లో బాస్కెట్‌కు బదులుగా బ్యాగులో పెట్టి వాటినే అందించారు. ఈ న్యూట్రీషన్ కిట్లతో గర్భిణులకు మేలు జరిగింది. ప్రస్తుతం జిల్లాలో 5,481 మంది గర్భిణులకు కిట్లు అం దించాల్సి ఉండగా, జిల్లాలో ఒక్క కిట్ కూడా అందుబాటులో లేదు.
సరఫరా కావడం లేదు..
జిల్లాలో న్యూట్రిషన్ కిట్ల సరఫరా నిలిచిపోయింది. అంతకు ముందు వచ్చిన కిట్లను గర్భిణులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి కిట్లు వస్తే మళ్లీ అందజేస్తాం.
డాక్టర్ చంద్రశేఖర్, మెదక్
జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త