calender_icon.png 25 September, 2024 | 6:02 PM

వ్యక్తి అనుమానాస్పద మృతి

25-09-2024 03:30:26 AM

పీఎస్ ఎదుట కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల ధర్నా

వికారాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి రెండు రాజకీయ పార్టీల మధ్య రగడకు దారి తీసింది. వివరాలు.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్ గ్రామంలో పదిరోజుల క్రితం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదే గ్రామానికి చెంది న ఇద్దరు అనుమానితులను మంగళవారం పీఎస్‌కు తీసుకొచ్చి విచారించారు.

ఇద్దరిలో ఒక వ్యక్తి పీఎస్ నుంచి తప్పించుకొని పార్టీ నాయకుడి ఇంటికి వెళ్లి తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు నాయకుడి ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న వ్యక్తిని పంపించాలని కోరారు. ఈ విషయంలో పోలీసులకు, బీఆర్‌ఎస్ నాయకుడికి మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వారితో కలిసి పీఎస్‌కు వెళ్లగా స్టేషన్‌లోనికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో బీఆర్‌ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి పోలీసులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు పీఎస్ వద్దకు చేరుకొని బీఆర్‌ఎస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉదృక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించడంతో గొడవ సద్దుమణిగింది.