06-03-2025 12:00:00 AM
కాటారం, మార్చి 5 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం అడ్డ రోడ్డు సమీపంలో గల రుద్ర కాటన్ జిన్నింగ్ మిల్లు లో బుధవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మండలంలోని ధన్వాడ సమీపంలో గల మీనాక్షి జిన్నింగ్ మిల్లులో గత జనవరిలో అగ్నిప్రమాదం సంభవించింది. తాజాగా బుధవారం రుద్ర జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించడం, పత్తి తో పాటు మిషనరీ యంత్రాలు కాలిపోయాయి. యాదృచ్ఛికంగా జరిగిన సంఘటననా లేక ఇన్సూరెన్స్ డబ్బులు పొందడం కోసమా అనే అనుమానాలను రైతాంగం వ్యక్తం చేస్తున్నారు . రెండు పత్తి మిల్లులలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుండి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సీసీఐకి శటగోపం పెట్టడం కోసమేనా అనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయని అన్నదాత ఆక్రోశంగా ప్రశ్నిస్తున్నారు. పత్తి మిల్లులో ఫైర్ సేఫ్టీ ఉన్నప్పటికీ కొనుగోలు చేసిన పత్తి అగ్నికి ఆహుతి కావడం విస్మయానికి గురి చేస్తున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ తోపాటు ఆయా మిల్లుల యాజమాన్యాలు సొంతంగా రైతుల నుంచి, ట్రేడర్ల నుంచి నేరుగా కొంతమేరకు పత్తిని కొనుగోలు చేస్తుంది. కాగా సీసీఐకి సంబంధించిన పత్తి అగ్నికి ఆహుతి కావడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో పత్తి మిల్లులలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై సీసీఐ విజిలెన్స్ బృందాలతో పాటు పోలీసు ఇంటలిజెన్స్ వర్గాలు పూర్తిస్థాయిలో కూపి లాగితే అసలు విషయాలు బహిర్గతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లు స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు.