calender_icon.png 24 February, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజలింగమూర్తి హత్యపై అనుమానాలు..

19-02-2025 10:28:47 PM

కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం రెడ్డి కాలనీ సమీపంలో గల టీబీజీకేఎస్ కార్యాలయం ఎదురుగా బుధవారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురైన రాజలింగమూర్తి మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. భూపాలపల్లి మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ సరళ భర్త నాగవల్లి రాజలింగమూర్తి కావడం రాజకీయ కోణంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి, పొట్టలో పాలు మార్లు పొడిచి, అతి కిరాతకంగా హత్య చేశారు. రాజా లింగమూర్తి గతంలో కాలేశ్వరం ప్రాజెక్టు కంగుబాటుపై కేసీఆర్, మాజీ మంత్రులతో పాటు ప్రాజెక్టు నిర్మాణ గుత్తేదారు కంపెనీలపై కేసు నమోదు చేసిన విషయాన్ని పలువురు చర్చించుకుంటున్నారు.

దుండగులపై చట్టరీత్యా చర్యలు... సీఐ నరేష్ కుమార్

భూపాలపల్లి పట్టణంలో జరిగిన దారుణ హత్యకు పాల్పడిన దుండగులను గుర్తించి, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి పట్టణ సీఐ డి.నరేష్ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. 

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ ఖండన... 

భూపాలపల్లి పట్టణంలో హత్యకు గురైన రాజా లింగమూర్తి పార్థివ దేహాన్ని బుధవారం రాత్రి భూపాలపల్లి పట్టణ ప్రధాన ఆసుపత్రిలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సందర్శించారు. హత్యకు పాల్పడిన వారు ఎంతటి వారినైనా శిక్షించాలని, చట్టరీత్యా చర్యలు తక్షణమే చేపట్టాలని పోలీసులను కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి, త్వరగా దోషులను గుర్తించి, శిక్ష పడేలా చూడాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలి తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హత్యలు చేయడం సమస్యకు పరిష్కారం కాదని, సమంజసం కాదని ఎమ్మెల్యే జీఎస్ఆర్ అన్నారు.