26-03-2025 12:11:50 AM
ఇదే కాంగ్రెస్ పాలనకు నిదర్శనం
సొంత పనులకు కోట్లు..రైతు రుణమాఫీకి సున్నా
కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి
మాజీ మంత్రి హరీశ్‌రావు
మెదక్, మార్చి 25(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బయట ప్రశ్నిస్తే పోలీసుల కేసులు...అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్లు చేస్తున్నారని, కాంగ్రెస్ ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు విమర్శించారు. మంగళవారం ఆయన మాజీ స్పీకర్ మధుసూదనాచారితో కలిసి జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు ఇవ్వాల్సిన రెండు లక్షల రుణమాఫీపై ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. రుణమాఫీ అయినవాళ్ళకంటే కానివాళ్ళే ఎక్కువ ఉన్నారని, ఆరు నెలలైనా ఇప్పటికీ రుణమాఫీ కావడం లేదన్నారు. ఒట్టేసి దేవుళ్ళనే మోసం చేసిన రేవంత్రెడ్డికి రైతులను మోసం చేయడం లెక్కకాదన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో మేం ప్రశ్నిస్తుంటే ప్రతిదాడులు చేస్తున్నారు తప్ప సమాధానం ఇవ్వడం లేదని, చివరికి ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేశారని విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నారని, రైతులకు డబ్బులు ఇవ్వమంటే చేతులు రావడం లేదన్నారు. ఆశా వర్కర్లను సొమ్మసిల్లేలా పోలీసులతో కొట్టిస్తున్నాడని, ఇందిరా పార్కు వద్ద ధర్నాలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. డబ్బులు లేవని చెబుతున్న రేవంత్రెడ్డి రూ.20 వేల కోట్లతో హెచ్‌ఎండీఏలో టెండర్లు ఎట్లా పిలుస్తున్నారని, రూ.15 వేల కోట్లతో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్కులకు టెంటర్లు ఎలా పిలుస్తున్నారని, రూ.7 వేల కోట్లతో జీహెచ్‌ఎంసీలో టెండర్లు ఎలా పిలుస్తున్నారని ప్రశ్నించారు.
నీ భూములున్న మీ అత్తారిల్లు ఆమనగల్ కు రూ.5 వేల కోట్లతో 10 లైన్ల రోడ్డు ఎలా వేస్తున్నారని నిలదీశారు. రైతాంగం ఎక్కడికక్కడ రైతుబంధు, రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, రైతుల పక్షాన పోరాడుతామని హరీష్రావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, ఎర్రోల్ల శ్రీనివాస్, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, బట్టి జగపతి, మల్లిఖార్జున్గౌడ్, చంద్రాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.