calender_icon.png 19 March, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగ్గ ఆలయ అర్చకుడిపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ..!

19-03-2025 11:06:27 AM

వారం రోజులుగా వెల్లడించని స్థానిక ఎండోమెంట్ అధికారులు 

అర్చకుడిని కాపాడేందుకు అధికారులు, కొంత మంది కమిటీ సభ్యులు విశ్వప్రయత్నం 

కేసు వెనక్కి తీసుకోమని బాధిత మహిళ పై ఒత్తిడి 

అధికారుల తీరు పైన అన్నీ అనుమానాలే 

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరొందిన శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి దేవాలయం(Sri Bugga Raja Rajeswara Swamy Temple) ప్రధాన అర్చకుడిని విధులనుండి తొలగిస్తూ వారం రోజుల కిందట దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. బుగ్గ శివాలయంలో ప్రధాన అర్చకుడి పై భక్తుల నుండి తీవ్రస్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గతంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఈజ్ గాం శివ మల్లన్న దేవాలయంలో పనిచేసిన సమయంలో కూడా మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు.

స్థానిక అధికారులను మచ్చిక చేసుకుంటూ గతంలో తనపై వచ్చిన పలు ఫిర్యాదుల నుండి తప్పించుకుంటున్న ప్రధాన అర్చకుడు తాజాగా బుగ్గ దేవాలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు అమ్ముకుంటున్న ఒక నాయకపోడ్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా భక్తుల ఎదుట కాలితో తన్నే ప్రయత్నం చేయడంతో సదరు మహిళ తన భర్తతో కలిసి దేవాదాయ శాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు చాలా సీరియస్ గా తీసుకొని పలు దఫాలుగా అర్చకుడి పై విచారణ జరిపారు. విచారణలో అర్చకుడు సదరు మహిళపై అసభ్యంగా, అమర్యాదగా ప్రవర్తించారని తేలడంతో స్థానిక అధికారులు నివేదికను సంబంధిత దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఇన్స్పెక్టర్ కు నెలరోజుల కిందట అందజేశారు. దీనిపై వెంటనే స్పందించిన డిప్యూటీ కమిషనర్ క్రమశిక్షణ చర్యలకు స్థానిక అధికారులను ఆదేశించారు. అయితే దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా తొక్కిపెట్టే ప్రయత్నం స్థానిక ఎండోమెంట్ అధికారులు చేశారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ అధికారుల జారీ చేసిన ఉత్తరువులను సైతం పెడచెవిన పెట్టారు. నెలరోజుల వరకు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా స్థానిక ఎండోమెంట్ అధికారి విశ్వప్రయత్నం చేశారు.

బయటపెట్టిన'విజయక్రాంతి'

నెల రోజుల కిందట అర్చకుడి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులు జారీ చేసిన నివేదికను గోప్యంగా ఉంచిన విషయాన్ని' విజయ క్రాంతి ' ఈనెల 7న ప్రచురించి బయట పెట్టింది. దీంతో ఈ విషయం మండలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. స్థానిక ఎండోమెంట్ అధికారులు ఆగ మేఘాల మీద విచారణ నివేదికను పూర్తి చేసి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్, వరంగల్ డిప్యూటీ కమిషనర్ కు నివేదించారు. ఈ నివేదికను పరిశీలించిన ఉన్నతాధికారులు ఆలయ అర్చకుడిని విధుల నుండి సస్పెండ్ చేస్తూ వారం రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. అధికారిక ఉత్తర్వులను తీసుకోకుండా ఎమ్మెల్యే కు దగ్గరగా ఉండే ఒక నాయకుడితో సస్పెన్షన్ ఉత్తర్వులు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు బాహాటంగా చర్చ నడుస్తుంది.

మరోవైపు పాత పాలకవర్గం సభ్యుడి తో పాటు కొత్త కమిటీ కి చెందిన మరో ఇద్దరు సభ్యులు బాధిత మహిళను అర్చకుడి పై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తుంది. సస్పెన్షన్ ఉత్తర్వులు తీసుకోకుండా సతాయిస్తుండడంతో అధికారులు అర్చకుడి వాట్సప్ నెంబర్ కి పంపినట్లు తెలుస్తుంది. ఇంత జరుగుతున్నా అర్చకుడిపై విచారణ జరిపిన విషయాన్ని గాని, ఉన్నతాధికారులు సస్పెన్షన్ విధించిన విషయాన్ని గాని స్థానిక ఎండోమెంట్ అధికారులు బయటకు పొక్కనీకుండా, మీడియాకు వెల్లడించకుండా అష్ట కష్టాలు పడుతుండడం గమనార్హం. అధికారులు ఒకవైపు, కమిటీ సభ్యులు మరోవైపు సస్పెన్షన్ వేటు పడ్డ అర్చకుడిని కాపాడేందుకు పావులు కదుపుతుండడం, సస్పెన్షన్ ఉత్తర్వులను ఆలయ ప్రాంగణంలో అంటించకపోవడం  పట్ల తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికైనా అర్చకుడిపై అధికారులు జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులపై ఎండోమెంట్ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే అర్చకుడిని కాపాడేందుకు ఎండోమెంట్ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లు అవుతుందన్న అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తమౌతున్నాయి.