న్యూఢిల్లీ: ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించాడని సస్పెన్షన్ విధించారు. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) బజరంగ్ పునియాను ఆదివారం సస్పెండ్ చేస్తూ నోటీసులు జారీ చేసింది. నాడా ప్రకారం, మార్చి 10న సోనిపట్ వద్ద ట్రయల్స్ సమయంలో బజరంగ్ తన మూత్ర నమూనాను ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ తర్వాత అతను డోప్ నియమాన్ని ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేయబడ్డాడు.
బజరంగ్ తరపు న్యాయవాది విషుస్పత్ సింగానియా మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు. "అవును మేము నోటీసు అందుకున్నాము. దానిపై ఖచ్చితంగా స్పందిస్తాము. మేము గతసారి కూడా విచారణకు హాజరయ్యాము. ఈసారి కూడా మేము మా సమాధానం దాఖలు చేస్తాము. అతను ఏ తప్పు చేయలేదు కాబట్టి పోరాడతాను" అని బజరంగ్ తరపు న్యాయవాది చెప్పారు. నోటీసుపై స్పందించేందుకు బజరంగ్‌కు జూలై 11 వరకు గడువు ఉంది.