calender_icon.png 27 December, 2024 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెటాలియన్లపై సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలి

28-10-2024 01:49:12 AM

  1. మా కష్టాలను చెప్పేందుకే శాంతియుతంగా నిరసనలు 
  2. ఆందోళనల వెనుక రాజకీయ కోణం లేదు..
  3. సిరిసిల్లలో బెటాలియన్ల కొవ్వొత్తుల ర్యాలీ
  4. నల్లగొండలో తమ పిల్లలతో కలిసి బెటాలియన్ల ప్రదర్శన

నల్లగొండ/ సిరిసిల్ల, అక్టోబర్ 27 (విజయక్రాంతి): పోలీస్‌శాఖ శనివారం సస్పెండ్ చేసిన 39 మంది పోలీస్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదివారం సిరిసిల్ల  పట్టణ పరిధిలోని సర్దాపూర్ 17వ బెటాలియన్ కానిస్టేబుళ్లు డిమాండ్ చేశారు. ఆదివారం ఈ మేరకు బెటాలియన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.

తాము అనుభవిస్తున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా సస్పెండ్ అయిన వారు 39 మంది ఉన్నారని, వారిలో తమ బెటాలియన్‌కు చెందిన వారు కూడా ఆరుగురు ఉన్నారని తెలిపారు. ఆ ఆరుగురిని తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు తమ నిరసన కార్యక్రమాలు ఆగవని స్పష్టం చేశారు.

తమ బెటాలియన్ కమాండెంట్‌ను వెంటనే  ఇక్కడి నుంచి మరోచోటికి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని, తమ వెనుక రాజకీయ కోణమేమీ లేదని తేల్చిచెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసమే నిరసన చేస్తున్నామన్నారు. సాయంత్రం వారు సిరిసిల్ల పట్టణంలోని బస్టాండ్ నుంచి గాంధీచౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో సుమారు 200 మంది బెటాలియన్లు పాల్గొన్నారు. అలాగే నల్లగొండ రూరల్ మండలం అన్నెపర్తి బెటాలియన్ ఎదుట కూడా బెటాలియన్లు తమ పిల్లలతో కలిసి ధర్నాకు దిగారు. వెట్టి చాకిరీ నుంచి తమకు విముక్తి కల్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నిశాఖల మాదిరిగానే, బెటాలియన్లకూ ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రూల్ కాల్ వ్యవస్థ సివిల్ ఆర్ తరహాలో ఉండాలని కోరారు. కామన్ మెస్ విధానం తీసివేయాలని డిమాండ్ చేశారు. పోలీస్‌శాఖ సస్పెండ్ చేసిన నల్లగొండకు చెందిన ఆరుగురిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, శనివారం పోలీస్‌శాఖ సస్పెండ్ చేసిన ౩౯ మందిని డిస్మిస్ చేస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.