calender_icon.png 28 September, 2024 | 4:48 PM

ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెస్షన్

27-09-2024 12:09:05 AM

ఒంటరి జంటలే టార్గెట్‌గా వసూళ్లు

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ఒంటరి జంటలను టార్గెట్‌గా చేసుకుని డయల్ 100 ట్యాబ్‌లో ఫొటోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ బ్లూకోర్టు కానిస్టేబుళ్లు వసూళ్ల పర్వానికి దిగిన అంశంపై విజయక్రాంతిలో ఈ నెల 23న ‘ఒంటరి జంటలే టార్గెట్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ స్పందించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు చిన్నయ్య, గడ్డ రాంచంద్రయ్యలను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నయ్యకు ఈ వ్యవహారం పట్ల సంబంధం లేకపోయినా డ్యూటీలో ఉండటంతో సస్పెస్షన్ వేటు తప్పలేదు. కాగా బ్లూకోర్టు పోలీస్ సిబ్బంది బెదిరింపులకు పాల్పడి వసూలు చేసిన డబ్బును తమ ఖాతాల్లోకి కాకుండా బినామీల నంబర్లకు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపించుకునేవారు. ముడావత్ రాము అనే మరో కానిస్టేబుల్ ఖాతాలోకి మళ్లించినట్టు సమాచారం. 

రూ.2వేలు వసూలు చేసిన కానిస్టేబుల్

బిజినపల్లి మండలానికి చెందిన కల్మూరి సురేష్ అనే వ్యక్తి తాను ప్రేమించిన యువతిని ఆమె తల్లిదండ్రులు బలవంతంగా లాక్కెళ్లారని డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వినోద్‌రెడ్డి యువతిని తిరిగి తెచ్చేందుకు దారి ఖర్చుల నిమిత్త రూ.రెండు వేలు ఇవ్వాలని వసూలు చేసినట్లు గురువారం బిజినపల్లి పోలీసులకు సురేష్‌తో పాటు అతని తాత దుమ్మకొండ వెంకటయ్య ఫిర్యాదు చేశారు.