calender_icon.png 30 September, 2024 | 12:49 AM

ఆ కాలేజీల్లో కౌన్సెలింగ్‌పై సస్పెన్స్!

29-09-2024 12:00:00 AM

ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు 

సీట్ల పెంపునకు అనుమతులిచ్చిన వాటి భర్తీకి సుప్రీంకోర్టు ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 2౮ (విజయక్రాంతి): పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్ నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంజినీరింగ్‌లో సీట్ల పెంపునకు ప్రైవేట్ కాలేజీలకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీం కోర్టు వారం క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఒక వైపు తరగతులు ప్రారంభం కాబోతున్నాయి.

ఈ నెల 15 వరకే బీటెక్‌లో ప్రవేశాలకు గడువు ఉండటంతో దాన్ని అక్టోబర్ 23 వరకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) బుధవారం పొడిగించింది. తాజాగా విద్యా క్యాలెండర్ మారడంతో గతంలో సీట్ల పెంపు కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ౧౧ ఇంజినీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారా? లేదా? అన్న సందిగ్ధత నెలకొంది.

ఆ కాలేజీల్లో 7 వేల సీట్లు! 

ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో డిమాండ్ లేని సివిల్, మెకానికల్ కోర్సులకు సంబంధించిన సీట్ల స్థానంలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఇతర కోర్సులు ప్రారంభించుకునేందుకు ఏఐసీటీఈ అనుమతి ఇవ్వగా, జేఎన్టీయూహెచ్ సైతం నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) గతంలో ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ సీట్లను ఆయా కాలేజీలు విక్రయించుకున్నాయి.

కానీ, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో దాదాపు 11 కాలేజీలు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో మాప్ అప్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఈ నెల 9న ఆదేశాలు జారీచేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.

రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అయి తే కౌన్సెలింగ్ నిర్వహణకు ఇప్పటి వరకు ఎటువంటి ఆర్డర్ కాపీ అందలేదని అధికారులు చెప్తుండటం గమనార్హం. మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో విద్యా శాఖ అధికారులు ఉన్నట్టు  సమాచారం.

ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ అనుమతి ఇచ్చినంత మాత్రాన అది ఫైనల్ కాదని సీట్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. కోర్టు తీర్పును అమలు చేస్తే ఆయా కాలేజీల్లో సుమారు ౭ వేల సీట్ల వరకు అందుబాటులోకి రానున్నాయి. కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నా యి.

ఒకవేళ ఇప్పుడు కుదరకపోతే వచ్చే విద్యాసంవత్సరంలోనైనా పెరిగిన సీట్లను భర్తీ చేసుకోవచ్చనే ఆలోచన లో కాలేజీల యాజమాన్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఆయా కాలేజీల్లో కౌన్సెలింగ్ నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే అనుమతులు రాకముందే అభ్యర్థులకు సీట్లను విక్రయించుకున్న కాలేజీలు.. కొంత మంది విద్యార్థులకు కట్టిన ఫీజును తిరిగి చెలించగా, మరికొంత మందికి వేరే బ్రాంచీల్లో సీట్లను సర్దుబాటు చేసినట్టు తెలిసింది.