calender_icon.png 20 January, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైఫ్‌ను పొడిచిన నిందితుడు అరెస్ట్

20-01-2025 12:00:00 AM

  • థానేలోని లేబర్ క్యాంపు వద్ద అదుపులోకి
  • విచారణలో నేరం చేసినట్టు అంగీకారం
  • ముంబై కోర్టులో హాజరుపర్చిన అధికారులు
  • ఐదురోజుల పోలీసు కస్టడీకి అప్పగింత 

ముంబై, జనవరి 19: ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మూడు రోజుల గాలింపు తర్వాత ఆదివారం తెల్లవారుజామున థానేలోని హీరానందని ఎస్టేట్  సమీపంలో గల మెట్రో నిర్మాణ స్థలంలోని లేబర్ క్యాంపు వద్ద  నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

ఈ క్రమంలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. విచారణ సందర్భంగా నిందితుడు బంగ్లాదేశ్‌కు చెందిన 30 ఏళ్ల మహమ్మద్ షరీఫ్ ఇస్లాం షెహ్‌జాద్‌గా భావిస్తున్న అధికారులు.. అతడిని ముంబై కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో షరీఫ్‌ను ఐదురోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఎవరీ మహమ్మద్ షరీఫ్..

మహమ్మద్ షరీఫ్ ఇస్లాం షెహ్‌జాద్‌ను థానేలో అదుపులోకి తీసుకున్న తర్వాత తొమ్మిదో జోన్ డీసీపీ దీక్షిత్ గడమ్ అరెస్టుకు సంబంధించిన వివరాలను మీడియా వెల్లడించారు. తొలుత నిందితుడు తన పేరును విజయ్ దాస్‌గా పేర్కొన్నట్టు వెల్లడించారు. అయితే తమ విచారణలో అతడు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా బయటపడిందన్నారు. భారత పౌరుడు అని నిరూపిం చుకోవడానికి అతడి వద్ద ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు.

ఆరేడు నెలల కిందట షరీఫ్ అక్రమంగా పశ్చిమ  బెంగాల్‌లోకి చొరబడి ఆ తర్వాత ముంబైకి చేరుకున్నట్టు భావిస్తున్నామన్నారు. ముంబైలోని వేరు వేరు ప్రాంతాల్లో బిజయ్ దాస్, విజయ్ దాస్, మహ్మద్ ఇలియాస్ వంటి వేరు వేరు పేర్లతో హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేసినట్టు గుర్తించామన్నారు.

అలాగే నిందితుడు తనను పోలీసులు వెతుకుతున్న విషయాన్ని ఎప్పటికప్పుడు న్యూస్ చానళ్ల ద్వారా తెలుసుకున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. నిందితుడికి ముంబైలో ఎవరు సపోర్ట్ చేశారు? సైఫ్‌పై దాడి వెనక కుట్ర కోణం ఉందా అనే వివరాలు విచారణలో బయటపడతాయని డీసీపీ పేర్కొన్నారు. 

సహాయపడ్డ సీసీ కెమెరా దృశ్యాలు

నిందితుడిని పట్టుకోవడంలో సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేయడానికి సరిగ్గా వారం రోజుల ముందు నిందితుడు బాదార్, ప్రభాదేవీ ప్రాంతాల్లో తిరిగినట్టు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు.

అనంతరం నిందితుడికి సంబంధించిన వేరు వేరు ఫొటోలను ముంబై, ముంబై పరిసర ప్రాంతాల్లో పోస్టర్లుగా వేయిం చారు. అలా పోస్టర్లు వేయించిన కొద్ది గంటల్లోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

కోలుకుంటున్న సైఫ్

సైఫ్ అలీఖాన్ కోలుకుంటున్నారని అతడి సోదరి సోహా అలీఖాన్ ఆదివారం పేర్కొన్నారు. సైఫ్ తొందరగా కోలుకోవడంపట్ల తమ కుటుం బం చాలా సంతోషంగా ఉన్నట్టు వెల్లడించారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతిఒక్కరికీ ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.