calender_icon.png 26 October, 2024 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారథి సూర్య

19-07-2024 12:35:50 AM

  • లంక పర్యటనకు భారత జట్టు ప్రకటన
  • వన్డే సిరీస్‌కు కోహ్లీ, రోహిత్
  • వైస్ కెప్టెన్‌గా గిల్

న్యూఢిల్లీ: భారత టీ20 జట్టు నయా సారథిగా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. ఇటీవల విండీస్ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో భారత్ జగజ్జేతగా నిలవగా.. ఆ తర్వాత రోహిత్ ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యం కాగా.. ముంబై బ్యాటర్ సూర్యకుమార్‌ను సెలెక్షన్ కమిటీ నయా నాయకుడిగా నియమించింది. టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్‌తో చర్చించిన అనంతరమే నూతన సారథి ఎంపిక జరిగినట్లు సమాచారం.

లంక పర్యటనలో భాగంగా భారత జట్టు 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌లకు గురువారం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల్లో ఆడనున్నారు. జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన శుబ్‌మన్ గిల్ అటు టీ20.. ఇటు వన్డే సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

హార్దిక్ పాండ్యా టీ20లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు.  రియాన్ పరాగ్ కూడా తొలిసారి వన్డే జట్టుకు ఎంపిక కాగా.. ఐదేళ్ల తర్వాత దూబే వన్డే జట్టులోకొచ్చాడు. సీనియర్లు రాహుల్, శ్రేయాస్ అయ్యర్ టీ20 సిరీస్‌కు ఎంపిక కానప్పటికీ.. వన్డే జట్టులో చోటు నిలబెట్టుకున్నారు. టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన స్పీడస్టర్ బుమ్రాకు లంకతో సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు.

టీ20 జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), గిల్, జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, పంత్ (వికెట్ కీపర్), శాంసన్ (వికెట్ కీపర్), పాండ్యా, దూబే, అక్షర్, సుందర్, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్, ఖలీల్, సిరాజ్. వన్డే జట్టు: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, కేఎల్ రాహుల్, పంత్ (వికెట్ కీపర్), అయ్యర్, దూబే, కుల్దీప్, సిరాజ్, సుందర్, అర్ష్‌దీప్, పరాగ్, అక్షర్, ఖలీల్, హర్షిత్ రాణా. భారత క్రికెట్‌లో నవశకానికి నాంది పడింది.

టీ20 ప్రపంచకప్ ట్రోఫీ అందుకున్న అనంతరం సీనియర్ క్రికెటర్లు రోహిత్, కోహ్లీ, జడేజా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా.. లంకతో టీ20 సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కొత్త సారథిని ఎంపిక చేసింది. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించడం ఖాయమే అని అంతా ఊహించినా.. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని సెలెక్షన్ కమిటీ సూర్య వైపు మొగ్గుచూపింది. వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ జట్టును నడిపించడనుండగా.. కోహ్లీ కూడా అందుబాటులో ఉండనున్నాడు.