మెదక్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి మృతి చెందిన సూర్య మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తెలిపారు. మెదక్ మండలం తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన రాట్ల సూర్య ఆగస్టు 6న దుబాయ్‌కి ఉద్యోగరీత్యా వెళ్లాడు. అయితే నాలుగు రోజుల క్రితం సూర్య అనారోగ్యంతో దుబాయ్‌లోనే మరణించినట్లు ఏజెంట్ ద్వారా తెలిసింది. అతడి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి మెదక్ ఎంపీ రఘునందన్‌రావుకు విన్నవించగా భారత రాయబారితో మాట్లాడినట్లు తెలిపారు. సూర్య కుటుంబానికి ధైర్యం చెప్పడానికి గ్రామానికి వెళ్లి పరామర్శించినట్లు సోమవారం శ్రీనివాస్ తెలిపారు. ఆయన వెంట స్థానిక మాజీ సర్పంచ్ ఎలక్షన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.