calender_icon.png 5 November, 2024 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటు సూర్య ఇటు బుమ్రా

21-06-2024 02:28:39 AM

  • అఫ్గాన్‌పై భారత్ జయకేతనం

సూపర్-8లో రోహిత్ సేన బోణీ

టీ20 ప్రపంచకప్

* బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్.. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా విజృంభించడంతో టీ20 ప్రపంచకప్ సూపర్ టీమిండియా తొలివిజయం నమోదు చేసుకుంది. లీగ్ స్టేజ్‌లో భీకర బౌలింగ్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన భారత్.. కీలకమైన సూపర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. న్యూయార్క్ పిచ్‌లపై బ్యాటింగ్ చేసేందుకు నానా కష్టాలు పడ్డ భారత బ్యాటర్లు.. విండీస్ గడ్డపై స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన మంచి స్కోరు చేయగా.. ఆనక బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ సమష్టిగా కదంతొక్కడంతో విజయం ఖాయమైంది!

బ్రిడ్జ్‌టౌన్: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. గ్రూప్ దశలో పరాజయం ఎరగకుండా.. సూపర్ అడుగుపెట్టిన రోహిత్ సేన.. ఇక్కడ కూడా ఆడిన తొలి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. గురువారం జరిగిన సూపర్ గ్రూప్ భారత్ 47 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మెగాటోర్నీలో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఈ వరల్డ్‌కప్‌లో రెండంకెల స్కోరు చేశాడు. క్రీజులో ఉన్నంతసేపు సాధికారికంగా బ్యాటింగ్ చేసిన విరాట్ 24 బంతుల్లో ఒక సిక్సర్‌తో 24 పరుగులు చేశాడు. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రిషబ్ పంత్ (20; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలువలేకపోగా.. ఆఖర్లో అక్షర్ పటేల్ (12; 2 ఫోర్లు) విలువైన పరుగులు జోడించాడు. అఫ్గాన్ బౌలర్లలో కెప్టెన్ రషీద్ ఖాన్, ఫజల్‌హక్ ఫరూఖీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గాన్ 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. అజ్మతుల్లా ఓమర్‌జాయ్ (26) టాప్ స్కోరర్. కాగా.. భారత బౌలర్లలో బుమ్రా, అర్ష్‌దీప్ చెరో 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. తదుపరి మ్యాచ్‌లో శనివారం బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. 

సత్తాచాటిన సూర్యకుమార్..

మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు శుభారంభం దక్కలేదు. ఈ మ్యాచ్‌లోనూ రోహిత్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించగా.. మూడో ఓవర్‌లోనే రోహిత్ (8) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో కోహ్లీ కాస్త సంయమనం ప్రదర్శించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన రిషబ్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. నవీన్ ఓవర్‌లో కోహ్లీ భారీ సిక్సర్ బాదగా.. నబీకి పంత్ హ్యాట్రిక్ ఫోర్లు రుచి చూపాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి టీమిండియా 47/1తో మంచి స్థితిలో కనిపించింది. అయితే రషీద్ తన తొలి ఓవర్‌లో పంత్‌ను ఔట్ చేయడంతో పరుగుల రాక గగనమవగా.. తదుపరి ఓవర్‌లో విరాట్ కూడా రషీద్‌కే చిక్కాడు.

కాసేపటికే శివమ్ దూబే (10) కూడా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అంపైర్ తొలుత నాటౌట్ ఇచ్చినా.. డీఆర్‌ఎస్‌కు వెళ్లిన రషీద్ ఫలితం సాధించాడు. ఇక అక్కడి నుంచి సూర్యకుమార్ ఇన్నింగ్స్ భారాన్ని భూజానికెత్తుకున్నాడు. రన్‌రేట్ పడిపోకుండా అడపా దడపా షాట్లు ఆడిన సూర్య.. చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. అతడికి పాండ్యా నుంచి చక్కటి సహకారం అందడంతో స్కోరు రాకెట్ వేగం అందుకుంది. అయితే ఆఖర్లో వీరిద్దరూ ఔట్ కావడంతో టీమిండియా ఊహించిన దానికంటే తక్కువ పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. జడేజా (7) మరోసారి నిరాశ పర్చగా.. చివరి ఓవర్‌లో అక్షర్ రెండు బౌండ్రీలు కొట్టాడు. 

కట్టుదిట్టమైన బౌలింగ్..

టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతున్న బౌలర్లు.. సూపర్ 8లోనూ అదే జోష్ కొనసాగించారు. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై బుమ్రా రెచ్చిపోవడంతో అఫ్గాన్ కోలుకోలేకపోయింది. బుమ్రా తన తొలి ఓవర్‌లోనే రహ్మానుల్లా (11)ను ఔట్ చేయగా.. ఇబ్రహీం జద్రాన్ (8)ను అక్షర్ వెనక్కి పంపాడు. తదుపరి ఓవర్‌లో హజ్రతుల్లా (2)ను కూడా బుమ్రా బుట్టలో వేసుకున్నాడు. గుల్బదీన్ నైబ్, అజ్మతుల్లా కాస్త పోరాడే ప్రయత్నం చేసినా.. భారత బౌలర్లు పట్టు విడవలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ అఫ్గాన్‌పై ఒత్తిడి పెంచారు. దీంతో అఫ్గాన్ లక్ష్యానికి 47 పరుగుల దూరంలోననే నిలిచిపోయింది. 

స్కోరు వివరాలు

భారత్: రోహిత్ (సి) రషీద్ (బి) ఫజల్‌హక్ 8, కోహ్లీ (సి) నబీ (బి) రషీద్ 24, పంత్ (ఎల్బీ) రషీద్ 20, సూర్య (సి) నబీ (బి) ఫజల్‌హక్ 53, దూబే (ఎల్బీ) రషీద్ 10, హార్దిక్ (సి) అజ్మతుల్లా (బి) నవీన్ 32, జడేజా (సి) నైబ్ (బి) ఫజల్‌హక్ 7, అక్షర్ (రనౌట్) 12, అర్ష్‌దీప్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: 20 ఓవర్లలో 181/8. వికెట్ల పతనం: 1 2 3 4 5 6 7 8 బౌలింగ్: ఫజల్‌హక్ 4 నబీ 3 నవీన్ 4 రషీద్ 4 నూర్ 3 అజ్మతుల్లా 2 

అఫ్గానిస్థాన్: రహ్మానుల్లా (సి) పంత్ (బి) బుమ్రా 11, హజ్రతుల్లా (సి) జడేజా (బి) బుమ్రా 2, ఇబ్రహీం (సి) రోహిత్ (బి) అక్షర్ 8, నైబ్ (సి) పంత్ (బి) కుల్దీప్ 17, అజ్మతుల్లా (సి) అక్షర్ (బి) జడేజా 26, నజీబుల్లా (సి) అర్ష్‌దీప్ (బి) బుమ్రా 19, నబీ (సి) జడేజా (బి) కుల్దీప్ 14, రషీద్ (సి) జడేజా (బి) అర్ష్‌దీప్ 2, నూర్ (సి) రోహిత్ (బి) అర్ష్‌దీప్ 12, నవీన్ (సి) పంత్ (బి) అర్ష్‌దీప్ 0, ఫజల్‌హక్  (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు: 19, మొత్తం: 20 ఓవర్లలో 134 ఆలౌట్. వికెట్ల పతనం: 1 2 3 4 5 6 7 8 9 10 బౌలింగ్: అర్ష్‌దీప్ ,4 బుమ్రా 4 అక్షర్ 3 హార్దిక్ 2 కుల్దీప్ 4 జడేజా 3