19-03-2025 02:10:06 AM
చర్యలు తీసుకున్న డీఎంహెచ్‌వో ప్రసన్నకుమారి
పెద్దపల్లి, మార్చి 18 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సూర్య ఆదిత్య నర్సింగ్ హోమ్‌ను మంగళవారం సీజ్ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి అన్నా ప్రసన్నకుమారి తెలిపారు. ఈ నర్సింగ్ హోమ్ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారనే ఆరోపణలొచ్చాయి.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారితో పాటు డిప్యూటీ డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు పోలీసులతో కలిసి తనిఖీ చేశారు. తొమ్మిది బెడ్స్‌కు అనుమతి ఉండగా 25 కంటే ఎక్కువ బెడ్స్‌తో నడుపుతున్నారని గుర్తించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో ఉన్న ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ నిర్వహిస్తున్నారని, రోగుల భద్రతను పాటించడం లేదని గుర్తించారు.
అలాగే చట్ట ప్రకారం రెండు సంవత్సరాల వరకు గర్భిణుల స్కానింగ్ వివరాలను జాగ్రత్త పరచవలసి ఉండగా అలా చేయడంలేదు. డా. లావణ్య, గైనకాలాజిస్ట్ మాత్రమే స్కానింగ్ చేసే అర్హత ఉండగా అర్హత లేకున్నా డా. శ్రీనివాస్ స్కానింగ్ చేస్తున్నాడు.
లావణ్య వైద్య, ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగిని. అయినా కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేస్తున్నదని గుర్తించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేసి అబార్షన్లు చేస్తున్నారని సమాచారం ఉందని డీఎంహెచ్‌వో తెలిపారు.
ఈ ఆసుపత్రికి గతంలోనే నోటీసులు ఇచ్చినా సరి చేసుకోలేదని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నందున నర్సింగ్ హోమ్‌ను సీజ్ చేశామని వెల్లడించారు.