calender_icon.png 25 October, 2024 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుప్పకూలిన మూసీ బతుకు

14-10-2024 12:00:00 AM

యాడనుండో వచ్చి 

గీడనే నా మొదటి పాదాన్ని

మోపానని అవ్వ చెప్పింది..

పుట్టి పెరిగిందాయే 

ఈ తావు అంటే చచ్చేంత ఇష్టం

జల్లెడకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయో 

మా ఇంటి పైకప్పుకు అన్ని ఉన్నాయి. 

అయినా మా ఇంట్లోలంటే ఎంతిష్టమో 

వర్షానికి అయినా, గాలి దుమారం కైనా 

పొద్దంతా సూర్యరశ్మికి మా పైన 

తన స్పర్శ తాకకుండా వెళ్ళదాయే 

నిత్యం మాకు తోడుండేవి, దోమలు 

మురికి నీళ్లు, కౌసు వాసనలు.

పేగుబంధాన్ని పెనవేసుకున్న లాగున 

మా బతుకుల నిండా పేదరికమాయే

ఆకలి బాధ యుద్ధాన్ని ప్రకటించినప్పుడు 

ఈ గుడిసెలోనే కడుపులో కాళ్లు పెట్టుకొని 

బిక్కు బిక్కుమంటూ ఒకరికొకరం 

కన్నీళ్ళని దోసిల్లతో ఇంటి ముందరి 

చెరువుని నింపేటోళ్లం.

పిడుగు పడి మృత్యువు కబళించినట్టు 

మా జీవితాల్ని నేలపాలు చేయడానికి 

ఇప్పుడు మా ఆశల సౌధాలను  

హైడ్రా కుప్పకూలుస్తుంది ... 

బజారున పడ్డ బతుకులకు 

ఎవరొచ్చి భరోసాను ఇస్తారు? 

 గాజోజి శ్రీనివాస్