డా. తిరుణహరి శేషు :
దేశంలో రిజర్వేషన్లు సామాజిక న్యాయ సాధన కోసం మాత్రమే కాదు సమాన న్యాయ (ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్) సాధన దిశగా కూడా అమలు చేయాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినపడుతున్నాయి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ 75 సంవత్సరాలలో విద్య, ఉద్యోగాలలో రాజకీయ అవకాశాలలో అమలవుతున్న రిజర్వేషన్లపైన భిన్నాభిప్రాయాలు ఉన్నా దేశంలో అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు కొనసాగాలనేది ఒక సహేతుకమైన వాదన.
రిజర్వేషన్లు అందుకుంటున్న సామాజిక వర్గాలలో నిజంగా వెనుకబడిన అట్టడుగున ఉన్న వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు ఆందటం లేదని జస్టిస్ రోహిణి కమిషన్ సహా అనేక కమీషన్లు తమ అభిప్రాయాలను వెల్లడి చేసిన నేపథ్యంలో సమన్యాయం అనే డిమాండ్ విస్తృతమవుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1994 నుండి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2019 వరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ సామాజిక వర్గాలకు కల్పించిన రిజర్వేషన్లలో అత్యంత వెనుకబడిన వర్గాలకు (ఎంబీసీ), సంచార జాతులకు నామమాత్రపు ప్రాతినిధ్యం కూడా దక్కలేదనేది వాస్తవం కాబట్టి భవిష్యత్తులో ఈ అసమానతలు కొనసాగకూ డదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను 23 శాతం నుండి 42 శాతానికి పెంచుతామనే హామీ తో పాటు రిజర్వేషన్లను వర్గీకరిస్తామనే హామీ కూడా ఇచ్చింది.
ఈ రెండు ప్రధానమైన హామీలను నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కులగణన చేపట్టటంతో పాటు మరొకవైపు రాజకీయ వెను కబాటుతనాన్ని గుర్తించి రిజర్వేషన్ల పెంపు ను సిఫారసు చేయటానికి డెడికేటెడ్ బీసీ కమిషన్‌నుకూడా ఏర్పాటు చేసింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
మండల్ కమీషన్ కులం ఆధారంగా వెనుకబాటుతనాన్ని గుర్తించి ఎలా రిజర్వేషన్లను సిఫారసు చేస్తుందనే అంశంపై సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన సందర్భం లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇంద్ర సాహ్ని కేసులో వెనుకబాటుతనాన్ని గుర్తించటానికి కులం కూడా ఒక ఆధారమే అనే చారిత్రాత్మక తీర్పుఇవ్వటం జరిగింది.
‘ట్రిపుల్ టెస్ట్’ ఆధారంగానే స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్ల కోటాను నిర్ణయిం చాలని కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల లో స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల కోటాను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి నిర్ణయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
తమిళనాడులో కూడా ఎంబీసీ, డిఎన్ సీ వర్గాలను సృష్టించి రిజర్వేషన్ల కోటాను విస్తృత పరిచారనే విషయాన్ని గమనించాలి. తమిళనాడులో వెనుకబడిన తరగ తులలో ఒక ఉన్నత వర్గం మాత్రమే రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందిందని 1970 లో కరుణానిధి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏ.ఎన్ సత్తి నాదన్ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నది.
1982లో ఏర్పాటు చేసిన అంబా శంకర్ కమిషన్ కూడా బీసీలలో ఉన్న 11 కులాలు మాత్రమే ప్రయోజనం పొందాయని స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్లలో మెజారిటీ బీసీ కులాలకు ప్రాతినిధ్యం దక్కలేదు.
స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ల కల్పనకు మహారాష్ట్ర ప్రభుత్వం బాందియా కమిషన్‌ను ఏర్పాటు చేస్తే తెలంగాణలో కూడా స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను పెంచటానికి, రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన సిఫారసులు చేయటానికి రాష్ట్ర ప్రప్రభుత్వం భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో డెడికేటెడ్ బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసింది.
డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి సమగ్రమైన లెక్కల ద్వారా రాజకీయ వెనుకబాటుతనాన్ని గుర్తించి రిజర్వేషన్ల పరిమితి 50 శాతం కంటే మించకుండా స్థానిక సంస్థలలో కోటాను నిర్ణయించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
వర్గీకరణ జరగాలి
తెలంగాణ రాష్ట్రంలో 134 బీసీకులాలు ఉన్నాయి. స్థానిక సంస్థలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించినా, తెలంగాణ రాష్ట్రంలో 23 శాతం రిజర్వేషన్లు బీసీ వర్గాలకు కల్పిస్తు న్నా రిజర్వేషన్లలో వర్గీకరణ చేపట్టకపోవడం వలన మెజార్టీ కులాలకు రాజకీయ అవకాశాలు దక్కటం లేదు.
రిజర్వేషన్లు ఉన్నా100కు పైగా బీసీ కులాలకు స్థానిక సంస్థలలో రాజకీయ అవకాశాలు దక్కటం లేదనే విషయాన్ని మరువకూడదు. విద్య, ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీ, ఇ లుగా వర్గీకరించినప్పటికీ స్థానిక సంస్థలలో కల్పించే రిజర్వేషన్లలో వర్గీకరణ లేకపోవడం వలన మెజార్టీ కులాలకు అవకాశం దక్కలేదనే చెప్పాలి.
స్థానిక సంస్థల రిజర్వేషన్లలో వర్గీకరణ లేకపోవడం వలన ఎంబీసీలు, సంచార జాతులకు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. 2019 లో రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలలో 23 శాతం రిజర్వేషన్ల ప్రకారంగా బీసీలకు 2936 పంచాయతీలు రిజర్వ్ చేశారు. ఈ రిజర్వుడ్ పంచాయతీలలో సంచార జాతులకు అవకాశం దక్కలేదు.
ఎంబీసీలకు ఒక్క శాతం కంటే తక్కువ అవకాశాలు దక్కటం వలన సంచార జాతులకు, ఎంబీసీలకు అన్యాయం జరిగింది. మందులు, గంగిరెద్దులు, కాటి పడగల, బాలసంతు లు, దొమ్మరి, పూసల, దాసరి, రాజనాల, జంగం, మొండి బండ, వంశరాజ్, పెద్ద మ్మ వాళ్ళు, వీరముష్టి, దూదేకుల, పింజరి, గాండ్ల లాంటి అనేక కులాలకు అవకాశా లు దక్కటం లేదు కాబట్టి స్థానిక సంస్థల లో బీసీల రిజర్వేషన్ కోటాను వర్గీకరించి ఎంబీసీలకు, సంచార జాతులకు న్యాయం చేయాలనే డిమాండ్ విస్తృతంగా వినపడుతోంది.
వెనుకబాటుతనమే ఆధారం
తెలంగాణ ప్రభుత్వం హామీ మేరకు రాష్ట్రంలో స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్ కోటాను పెంచటానికి ఉన్న మార్గాల లో ప్రధానమైనది ఎంబీసీలు సంచార జాతుల రాజకీయ వెనుకబాటుతనమే. 1994 నుండి ఇప్పటివరకు సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కానీ తెలంగాణలో కానీ ఎంబీసీ లు, సంచార జాతుల రాజకీయ వెనుకబాటుతనాన్ని ఆధారంగా చేసుకుని బీసీల రిజర్వేషన్లను విస్తృత పరచటానికి ప్రభు త్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పుడే స్థానిక సంస్థలలో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించగలుగుతుంది.
ఎంబీసీలు, సంచార జాతు ల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగాలలో వెనుకబాటుతనం ప్రాతిపదికగా స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించాలి. ఇప్పటివరకు ఆయా రాష్ట్రాలలో స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషనకు సంబంధించిన అన్ని న్యాయపరమైన అంశాలు ఆయా సామాజిక వర్గా ల వెనుకబాటుతనానికి సంబంధించినవే కాబట్టి తెలంగాణలో అన్ని అడ్డంకులను అధిగమించి రిజర్వేషన్ల విస్తృతిని సాధించటానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపు ణులతో ఒక లీగల్ సెల్‌ను ఏర్పాటు చేయాలి.
దేశంలో 2600 ఓబీసీ కులాలు ఉంటే 983 ఓబీసీకులాలకు ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదు, 984 కులాలకు 2.68 శాతం అవకాశాలు మాత్ర మే దక్కినాయి. 97 శాతం ఉద్యోగాలు కేవ లం 25 శాతం కులాలు అందిపుచ్చుకున్నాయని జస్టిస్ రోహిణి కమిషన్ తన రిపో ర్టులో ప్రస్తావించారు.
ఇదే విధమైన అసమానతలు దేశవ్యాప్తంగా, రాష్ట్రాలలోనూ నెలకొని ఉన్న నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే ఎంబీసీలు, సంచార జాతుల ఆర్థిక రాజకీయ సామాజిక వెనుకబాటుతనాన్ని బయటపెట్టి సామాజిక న్యాయ సాధనలో భాగం గా వారి ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పుడే కులగణన దేశానికే ఆదర్శమవుతుంది. ఈ మోడ ల్‌నే దేశమంతా అనుసరిస్తే అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం, సమన్యాయం జరుగుతుందని ఆశిద్దాం.
వ్యాసకర్త సెల్: 9885465877