- రాష్ట్రంలోనే మోడల్‌గా భద్రాద్రి జిల్లా ఉండాలి
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 11 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భూ సమస్యల పరిష్కారానికై చేపట్టాల్సిన చర్యలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, రెవెన్యూ అధికారులతో ఐడీవోసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సూచన మేరకు ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని, ఒక పెద్ద సర్వే నంబర్‌లోని భూ సర్వే చేస్తామని చెప్పారు. ఒకే సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూమి, అటవీ భూమి, పట్టా భూమి ఉండటం వలన ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు.
ఈ సమస్యల శాశ్వత పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. దీని ద్వారా బోగస్ పట్టాలను రద్దు చేయొచ్చని అధికారులకు సూచించారు. భూమి సర్వే చేయడానికి గాను అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోనే భూ సమస్యల పరిష్కారానికి జిల్లా మోడల్‌గా నిలవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏడీ సర్వే ల్యాండ్, రికార్డ్ అధికారి శ్రీనివాసులు, కొత్తగూడెం ఆర్డీవో మధు పాల్గొన్నారు.