- క్షేత్రస్థాయిలో సాగుకు యోగ్యం కాని భూముల వివరాల సేకరణ
- గుట్టలు, వెంచర్లు, మైనింగ్ భూములకు రైతు భరోసా బంద్
- సంగారెడ్డి జిల్లాలో 7,19,377 ఎకరాల సాగు భూమి ఉన్నట్టు అంచనా
సంగారెడ్డి, జనవరి 16 (విజయ క్రాంతి): అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు వేసేందుకు సర్కారు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తుంది. రైతు భరోసాను సాగుకు యోగ్యమైన భూములకు డబ్బులు వేసేందుకు అధికారులు సర్వే ప్రారంభించారు. గతంలో పంటలు సాగు చేయని భూములకు రైతు భరోసా డబ్బులు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేసి అరులైన రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని సర్వేకు ఆదేశించింది. గతంలో వానకాలం పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ. పదివేల రూపాయల డబ్బులు అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పంటలకు గాను ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. పట్టాదారు పాస్ బుక్‌లో ఆధారంగా సర్వే నిర్వహించేందుకు ప్రభు త్వం నిర్ణయించింది.
గ్రామ సభలు పెట్టి గ్రామాలలో 21 నుంచి 24 వరకు రైతు భరోసా కోసం సర్లేని వారిని ఎంపిక చేస్తారని అధికారులు తెలిపారు. ఈనెల 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తారని అధికారులు వివరించారు. పంట పెట్టుబడి సహాయం కోసం రైతులు ఎదురుచూడడంతో వారి ఆశలు నెరవేర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రైతు భరోసా డబ్బులు రూ.12 వేలు
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను ఎకరాకు రూ. 15వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఎకరాకు 12000 ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 12000 ఇస్తామని ప్రకటించడంతో రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడి సాయం కోసం ఏడాదిగా ఎదురు చూస్తే, ప్రస్తుతం ఎకరాకు 12000 ఇవ్వడం తగదు అంటున్నారు.
వ్యవసాయ రెవెన్యూ అధికారులు భూభారతి పోర్టల్ నుంచి సేకరించిన గూగుల్ మ్యాప్ గ్రామ మ్యాప్లతో సాగుకు యోగ్యం గాని భూములను గుర్తిస్తున్నారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి వ్యవసాయానికి యోగ్యం గాని భూములను గుర్తిస్తున్నారు. సర్వే నంబర్లు రైతుల వివరాలు సేకరించి నివేదిక తయారు చేస్తున్నారు. ఒక రైతు ఎన్ని ఎకరాలలో పంట సాగు చేస్తున్నారో పూర్తి వివరాలు క్షేత్రస్థాయిలో సేకరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 116 క్లస్టర్లు ఉన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
క్లస్టర్ల వారిగా అధికారులను నియమించి వివరాలు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వ్యవ సాయ శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొని వివరాలు సేకరిస్తున్నారు. ఈనెల 20 వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించి, 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి వ్యవసాయ యోగ్యం గాని భూముల వివరాలు గ్రామ సభల్లో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. గ్రామసభల్లో ప్రకటించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు.
వెంచర్లు, గుట్టలు, మైనింగ్ భూములకు రైతు భరోసా బందు
ప్రభుత్వం వెంచర్లు, గుట్టలు, మైనింగ్ రూమ్ లోకి రైతు భరోసా డబ్బులు నిలిపి వేసేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. గతంలో రైతు భరోసా డబ్బులు అడ్డుగోలుగా ఇచ్చారని దీనిపై విచారణ చేపట్టాలని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సర్వేకు సిద్ధమైంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సర్వే చేసి నివేదిక సిద్ధం చేయడంతో ఈసారి వెంచర్లు, గుట్టలు రాలు రప్పలు, మైనింగ్ భూములకు పెట్టుబడి సహాయం ఉండకుండా ఉంటుంది.
సంగారెడ్డి జిల్లాలో 2024-24 సంవత్సరంలో 363544 మంది రైతులకు ప్రభుత్వం రూ.372.98 కోట్లు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసింది. ఈసారి క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యవసాయ పంటలు సాగు చేసే భూములకే రైతు భరోసా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేయడంతో భారీగా డబ్బులు తగ్గిపోయే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పంటలు సాగు చేయని భూములను తొలగించేందుకు సర్వే చేయడంతో భారీగా భూములు రైతు భరోసా నుంచి తొలగించడం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గ్రామాల చుట్టుపక్కల ఇండ్లు నిర్మాణమైన వాటికి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఇచ్చింది. ప్రస్తుతం సర్వే చేయడంతో ఎక్కడ కూడా ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదు. జనవరి 26న రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.