హైదరాబాద్, నవంబర్ 8(విజయక్రాంతి): ‘బీసీ కమిషన్ వద్ద సొంతంగా యంత్రాంగం లేదు. అందుకే ఈ సమగ్ర సర్వేను ఒక ప్రభుత్వ విభాగానికి అప్పగించాలని బీసీ కమిషన్ కోరింది. అందులో భాగంగానే ప్రభుత్వం ప్లానింగ్ శాఖకు అప్పగించింది’ అని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమగ్ర కులాల సర్వే ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్యుమరేటర్లు ఏ రోజు, ఏ ప్రాంతానికి వెళ్తారో ముందస్తుగా ఆ కుటుంబాలకు సమాచారం అందించేలా సూపర్ వైజర్లు చొరవ తీసుకోవాలన్నారు. సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడానికి ప్లానింగ్ శాఖ, కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్లానింగ్ శాఖ సేకరించిన ఈ సమాచారం బీసీ కమిషన్‌కు చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ఈ సమాచారాన్ని సమీక్షించి భవిష్యత్తులో ఎన్నో నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందన్నారు.