హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నిర్వహించిన కుల గణన నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub-Committee)కి అందజేశారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా(Secretary Sandeep Sultania) రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి కుల గణనకు సంబంధించిన రిపోర్టును సచివాలయంలో జరిగిన సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)కి సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కులగణన సర్వే 76 ప్రశ్నలతో ప్రజల ఆర్థిక స్థితిగతులతో పాటు అన్ని రకాల వివరాలను సేకరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 96.9 శాతం కుటుంబాలను అధికారులు సర్వే చేశారు. ఈ సర్వేలో తెలంగాణలో మొత్తం 3 కోట్ల 54 లక్షల మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. కాని, 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని కమిషన్ తన నివేదికలో తెలిపింది.
ఇదిలా ఉండగా, సబ్-కమిటీలో చర్చించిన తర్వాత ఈ కుల గణన నివేదికను మంత్రివర్గం ఆమోదిస్తుంది. తరువాత, ఈ నివేదికను తయారుచేసి ఈ నెల 5న జరిగే మంత్రివర్గ సమావేశం(Cabinet meeting)లో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, ఈ కుల గణన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. తరువాత, కుల గణనపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ నిర్వహించిన తర్వాత అసెంబ్లీ దానిని ఆమోదిస్తుంది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేసి ప్రజల సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ, ఉపాధి, కుల సర్వే కోసం ఉత్తర్వులు ఇచ్చింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కులగణన సర్వే చేయించి విజయవంతంగా పూర్తి చేసి నివేదికను సిద్ధం చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల దిశగా కులగణన సర్వే నివేదిక ఆమోదంతో ముందడుగు వేయనుంది. కాగా, ఈ నివేదిక త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.