calender_icon.png 13 January, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేయి తడిపితేనే సర్వే?

01-08-2024 04:41:27 AM

  1. సర్వే రిపోర్టు ఇవ్వడంలోనూ జాప్యమే 
  2. మామూళ్ల మత్తులో మెదక్ సర్వే శాఖ 
  3. జిల్లాలో 370 పెండింగ్ దరఖాస్తులు 
  4. సర్వేల్లో జాప్యంతో అన్నదాత ఆగం

మెదక్, జూలై 31 (విజయక్రాంతి): భూముల విస్తీర్ణం, హద్దుల వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో చెప్పాలంటే భూ సర్వే తప్పనిసరి. లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లోగా అధికారులు సర్వే చేయాలి. కానీ మెదక్ జిల్లాలో భూ సర్వే అధికారులు నెలల తరబడి దరఖాస్తులను పెండింగ్‌లోనే పెడుతున్నారు. దీంతో పలు భూ తగాదాలు జరుగుతున్నాయి. అధికారులకు మాముళ్లు ఇస్తేగానీ సర్వే చేపట్టడం లేదు. దీంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల తగాదాలు కూడా జరుగుతున్నాయి. రామాయంపేట మండలంలో భూ సరిహద్దుల తగాదాలో ఒక వ్యక్తిని దాయాదులు ఇటీవల హత్య చేశారు. కేవలం భూ సరిహద్దుల వల్ల ఏర్పడిన వివాదం మనిషి ప్రాణం తీసే స్థితికి వచ్చింది. ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలా వరకు జరుగుతున్నాయి. అయినా అధికారులు సర్వే చేయడంలో జాప్యం వహిస్తున్నారు. సర్వే చేసినా నివేదిక (రిపోర్టు) జారీలోనూ తీవ్ర జాప్యం చేస్తున్నారు. 

అన్నదాతలకు అవస్థలు 

భూమి సర్వే చేయించాలంటే అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. చలాన్లు చెల్లించి నెలలు గడుస్తున్నా సర్వేయర్లు పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారు. భూముల కొలతల్లో వచ్చే తేడాలు, భూ తగాదాలు, ఇతర అంశాల పరిష్కారంలో భూ సర్వే తప్పనిసరి. రైతులు తమ వివాదాలు పరిష్కరిం చుకోవడానికి అధికారులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 21 మండలాల పరిధిలో 370 పైచిలుకు  దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 

కొందరికి కోరిన వెంటనే సర్వే?

క్షేత్రస్థాయికి సర్వేయరు వెళ్లాలంటే.. ఆయన వాహనం దిగి పొలంలోకి వెళ్లి సర్వే చేసేంత వరకు సకల సౌకర్యాలు కల్పించాలి. అంతకుముందే కార్యాలయంలో ఎంతోకొంత ముట్టజెప్పాలి. నిబంధనల ప్రకారం దరఖాస్తులను వరుస క్రమంలో పరిష్కరించాలి. కానీ మాముళ్లు ఇవ్వని వారివి పెం డింగ్‌లో పెట్టి, ఇచ్చిన వారివి కోరిన వెంటనే పరిష్కరిస్తున్నారు. 

జిల్లాలో 11 మందే సర్వేయర్లు

మెదక్ జిల్లాలో 21 మండలాలు, నాలు గు మున్సిపాలిటీలు ఉన్నాయి. మండలానికి ఒక సర్వేయర్ ఉండాలి. కానీ జిల్లా వ్యాప్తం గా 11 మందే సర్వేయర్లు ఉన్నారు. అందులోనూ పక్క మండలాల ఇన్‌చార్జి బాధ్యత లు అప్పగించారు. దీనికితోడు ప్రభుత్వ పనులు అధికంగా ఉండటంతో దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. 

మామూళ్లు తీసుకుంటే చర్యలు

జిల్లాలో 21 మంది సర్వేయర్లు ఉం డాల్సి ఉండగా 11 మాత్రమే ఉన్నారు. గత నెల వరకు 370 దరఖాస్తులు పెం డింగ్‌లో ఉన్నాయి. క్రమపద్ధతిలో సర్వే నిర్వహిస్తున్నాం. గత 15 రోజులుగా సర్వేయర్లు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూ సేకరణ సర్వేలో ఉన్నారు. దీంతో కొంత ఆలస్యమవుతోంది. ఎవరైనా సర్వే చేయడానికి మామూళ్లు తీసుకుంటున్నట్లు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. 

 శ్రీనివాస్, ఇన్‌చార్జి ఏడీ, 

భూమి, కొలతల శాఖ, మెదక్