calender_icon.png 29 April, 2025 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డంపింగ్ యార్డ్ ను తరలించి గోదావరి పవిత్రతను కాపాడాలి

16-04-2025 07:34:14 PM

సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి..

సిపిఐఎం ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్థానిక సమస్యల సర్వే..

భద్రాచలం (విజయక్రాంతి): ఊరిలో సేకరించిన చెత్త మొత్తం తీసుకువచ్చి గోదావరి ఒడ్డున వేయడంతో గోదారి నీరు కలుషితమై హానికరంగా తయారవుతుందని పంచాయతీ అధికారులు వెంటనే డంపింగ్ యార్డ్ ను గోదారి కరకట్ట వద్ద నుండి తరలించి నదీ పవిత్రతను కాపాడడంతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పట్టణంలో నివాస ప్రాంతాలలో స్థానిక సమస్యలపై  పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల సర్వే బుధవారం ఒకటో వార్డు రామాలయం ఏరియా ప్రాంతంలో కొనసాగింది. ఈ సందర్భంగా పలు స్థానిక సమస్యలను స్థానిక సమస్యలను సిపిఐ బృందం దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ.. దక్షిణ అయోధ్యగా పిలవబడుతున్న భద్రాచల సీతారాముల దేవాలయం దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలు రాత్రులు నిద్రపోయే పరిస్థితి కూడా లేదని విపరీతమైన పొగతో వేసుకున్న ఇల్లు మొత్తం కూడా పొగతో నిండిపోయి ఊపిరి ఆడక ఊపిరితిత్తులు పాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో నివసించే కొంతమందికి క్యాన్సర్ కూడా వచ్చినదని ఊళ్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు అన్నిటిని కాల్చడం వల్ల క్యాన్సర్ కారకాలు ఎక్కువ అవుతున్నాయని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని విమర్శించారు.

లక్షల రూపాయలు ఖర్చు చేసి సుందరయ్య నగర్ లో ఏర్పాటు చేసిన అధనూతనమైన డంపింగ్ యార్డ్ ను నిర్మించి తడి చెత్తను పొడి చెత్తను వేరుచేసి వాటిని ఫైరింగ్ పిల్స్ గా మారుస్తున్నామని చెప్పినప్పటికీ అది పూర్తిస్థాయిలో అమలు కానందువలన ఇప్పటికీ రామాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకటి, రెండు, మూడు, నాలుగు, వార్డుల ప్రజలు విపరీతమైన బాధలు పడుతున్నారని అన్నారు. గ్రామపంచాయతీకి ఇన్చార్జిగా ఉన్నటువంటి, పిఓ, దీనిపై దృష్టి సారించి గోదావరి నదిలో రామాలయ పరిసరాలలో భద్రాచలంలోని వ్యర్థ పదార్థాలు అన్ని వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా భద్రాచలంలోనీ మురుగు నీరు యాత్రికులు స్నానాలు చేసే రేవు వద్ద కలవడంతో ఎంతో భక్తి భావంతో వచ్చే యాత్రికులు మురుగునీటిలో స్నానాలు ఆచరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నర్సారెడ్డి అన్నారు. వెంటనే ఆ డ్రైనేజీ వాటర్ ని కిందకి మళ్ళించాలని గోదావరి నీటిలో కలవ కుండ చర్యలు తీసుకోవాలని లేకపోతే స్థానిక ప్రజలను సమీకరించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ధనకొండ రాఘవయ్య, శాఖ కార్యదర్శి, ఆది, వెంకన్న, పోసి స్థానిక ప్రజలు పాల్గొన్నారు.