calender_icon.png 25 November, 2024 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియాకు సర్వే ఎఫెక్ట్!

25-11-2024 12:15:05 AM

  1. సమగ్ర కుటుంబ సర్వేలో ట్యాక్స్ సిబ్బంది బిజీబిజీ
  2. రూ.100 కోట్ల టార్గెట్‌కుగాను రూ.22 కోట్లే వసూలు
  3. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు డిసెంబరు నెల వేతనాలకూ తిప్పలే
  4. నాలుగు నెలలుగా వెంటాడుతున్న సమస్య

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బల్దియాకు కొత్త సమస్యను తీసుకొచ్చి పెట్టింది. అసలే ప్రతీనెలా వేతనాల సమస్య వెంటాడుతుండగా.. సర్వేలో బల్దియా సిబ్బంది నిమగ్నమవడంతో.. ఆస్తిపన్ను వసూలు సంగతి పక్కన పెట్టారు.

దీంతో డిసెంబర్ 1వ తేదీ ఉద్యోగుల అకౌంట్లలో జమకావాల్సిన వేతనాలపై బల్దియా వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. వేతనాలు జమచేసేందుకు మరో ఐదు రోజుల సమయమే ఉన్నా.. బల్దియా ఖాతాలో వేతనాలకు సరిపడా నిధులు లేకపోవడతో ఎలా ముందుకు పోవాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

పేరుకే ప్రభుత్వం ఉద్యోగం అయినప్పటికీ.. ప్రతినెలా వేతనాల సమస్య తలెత్తడంతో బల్దియా ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. 

సర్వేలో బిజీ... 

రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6వ తేదీ నుంచి నెలాఖరు దాకా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో గ్రేటర్ వ్యాప్తంగా 30 సర్కిళ్ల పరిధిలో సుమారు 23 లక్షలకు పైగా నివాసాలను సర్వే చేసేందుకు 19వేల మంది సిబ్బందిని అధికారులు నియమించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ అధికారులు, ఉద్యోగులే ఉన్నారు.

ఈ క్రమంలో వారంతా ఈనెల 6వ తేదీ నుంచి బల్దియా విధులు వదిలేసి సర్వే పనుల్లోనే మునిగిపోయారు. వీరిలో బల్దియాలో ప్రాపర్టీ ట్యాక్స్ విభాగానికి చెందిన 145 మంది ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, 340 మంది బిల్ కలెక్టర్లు కూడా ఉన్నారు. వీరంతా సర్వేలో బిజీగా ఉండటంతో  నవంబరు నెల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు దారుణంగా పడిపోయింది.

ఈ పరిస్థితుల్లో ఈ నెలలో ఇప్పటివరకు (24వ తేదీ నాటికి) రూ. 22 కోట్లు మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. వేతనాలకు ఇంకా మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో డిసెంబర్ నెల వేతనాలను ఎలా సర్దుబాటు చేయాలో తెలియక బల్దియా ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

అప్పులకుప్పగా జీహెచ్‌ఎంసీ

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిస్థితి ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువ అన్నచందంగా మారిపోయింది. దీనికితోడు వివిధ పనుల నిమిత్తం భారీగా అప్పులు చేసింది. దీంతో ప్రతినెలా బల్దియాకు వచ్చే ఆదాయంలో దాదాపు రూ.100 కోట్లు అసలు, వడ్డీల చెల్లింపులకే సరిపోతోంది. మరో రూ. 120 కోట్లు వేతనాలకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.

దీనికి అదనంగా కాంట్రాక్టర్లకు దాదాపు రూ.1300 కోట్లకు పైగా బల్దియా బకాయి ఉంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల వేతనాలకు సరిపడా నిధుల కోసం ప్రతినెలా ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది. గత నాలుగు నెలలుగా ఇదే తంతు నడుస్తోంది. దసరా పండుగ సమయంలోనూ సమయానికి వేతనాలు అందలేదు.

వాస్తవానికి ఈ ఏడాది (2024 25) ట్యాక్స్ టార్గెట్ రూ.2100 కోట్లుగా నిర్ణయించగా.. ఇప్పటికి రూ.1300 కోట్లు వసూలు అ య్యింది. ఇంకా మిగిలిఉన్న  మిగ తా రూ.700 కోట్లను (మార్చి నాటికి) ప్రతినెలా రూ.100 కోట్ల చొప్పున వసూలు చేయడంతో వేతనాల సమస్య తీరిపోతుందని బల్దియా భావించింది.