calender_icon.png 13 December, 2024 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాల్లో సర్వే పూర్తి

13-12-2024 01:56:03 AM

హైదరాబాద్‌లో తుదిదశకు

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తుదిదశకు వచ్చింది. జిల్లాల్లో కులగణన 100శాతం పూర్తి కాగా.. హైదరాబాద్‌లో చివరి ఘట్టానికి చేరుకుంది. సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్ చేసే ప్రక్రియ కూడా పూర్తికావొచ్చింది.

ఈ ప్రక్రియ జిల్లాల్లో చివరి అంకానికి చేరుకుంది. హైదరాబాద్‌లో సర్వే నెమ్మదిగా జరగడం వల్ల.. ఆన్‌లైన్ నమోదు కూడా అలాగే సాగుతోంది. ఇదే సమయంలో సర్వేను పకడ్బందీగా, డబ్లింగ్ లేకుండా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుం టున్నారు.

‘మీ సర్వే పూర్తయ్యిందా?’ అంటూ ఎన్యూమరేటర్లు, సిబ్బంది, అధికారులు ఫోన్లు చేసి కులగణన గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అనుమానం ఉన్న వాళ్లకు కాల్‌చేసి.. ‘సర్వే ఎక్కడ చేయించుకున్నారు’ అంటూ క్రాస్ చేక్ చేసుకుంటున్నారు. సర్వే లో నమోదైన కుటుంబం, మళ్లీ నమోదు కాకుండా.. డబ్లింగ్ లేకుండా చూస్తున్నారు. 

రాష్ట్రంలో నవంబర్ 9న కులగణన మొదలైంది. 

వాస్తవానికి నవంబర్ 30 నాటికి సర్వేను సంపూర్ణంగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావించింది. ఆ లక్ష్యంతోనే ఎన్యూమరేటర్లు, అధికారులు పనిచేశారు. అయితే మొదటినుంచి గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చాలా వేగంగా జరుగగా.. పట్టణాల్లో నత్తనడకన సాగింది. ప్రభుత్వం అనుకున్న విధంగా నవంబర్ 30 నాటికి హైదరాబాద్ మినహా రాష్ట్రంలో సర్వేను పూర్తి చేసింది.  

కీలకమైన వారికి ఫోన్లు!

అలాగే ప్రభుత్వంలోని కీలక ప్రతినిధులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర కీలక అధికారులు, జర్నలిస్టులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్ర రాజధానిలో ఉంటారు. వీరిలో కొందరి సర్వే పూర్తి కాలేదన్న సమాచారం మేరకు ఒక్కొక్కరికి ఫోన్ చేసి.. సర్వే పూర్తయ్యిందా? అంటూ ఫోన్ చేసే ఆఫీసర్ హోదాను భట్టి అధికారులు స్వయంగా కాల్ చేసి క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఈ క్రాస్‌చెక్‌లో భాగంగా కొందరు ప్రముఖల ఇళ్లు సర్వే కాలేదని తెలుసుకొని, వెంటనే సిబ్బందిని పంపించినట్లు సమచారం.

అసెంబ్లీ సమావేశాలు నాటికి.. 

అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 9న శీతాకాల సమావేశాలు మొదలైనా.. 16వ తేదీ నుంచి రెగ్యులర్‌గా జరగనున్నాయి. అయితే ప్రభుత్వం సర్వే చాలా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. దీంతో సర్వేను పూర్తి కాకుంటే, అసెంబ్లీలో ప్రతిపక్షాలకు దీన్ని ఆయుధంగా చేసుకొని విమర్శించే అవకాశం ఉందన్న ఆలోచన నేపథ్యంలోనే.. కులగణనను 15వ తేదీలోపు సర్వేతో పాటు ఆన్‌లైన్ ప్రక్రియను కూడా 100శాతం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అధికారులు కూడా ఆ దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

సవాల్‌గా హైదరాబాద్.. 

జిల్లాల్లో సర్వే సాఫీగా జరిగినా.. హైదరాబాద్ పూర్తిచేయడం ఎన్యూమరేటర్లు, అధికారులకు సవాల్‌గా మారింది. పాతబస్తీలో సర్వే చాలా నెమ్మదిగా జరగుతున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రతిగ్రామం నుంచి వందల సంఖ్యలో కుటుంబాలు హైదరాబాద్‌లో ఉపాధి, ఉద్యోగంతోపాటు వివిధ పనుల నిమిత్తం నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలో వీరిలో కొందరు తమ ఇంటి దగ్గర సర్వే చేయించుకున్నారు. మరికొందరు హైదరాబాద్‌లో తమ వివరాలను అధికారులకు అందజేశారు. ఇదే సమయంలో ఎన్యుమరేటర్లు సర్వేకు వచ్చినప్పడు కొందరు తాళాలు వేసి ఉన్న పరిస్థితులు ఉన్నారు. దీంతో అలాంటి కొన్ని ఇళ్ల సర్వే కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

అలాగే, మరికొందరు తమ సొంత గ్రామాలతో పాటు హైదరాబాద్‌లో కూడా వివరాలను అందజేసినట్లు అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అనుమానం ఉన్న వారికి సిబ్బంది ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా, ఆన్‌లైన్‌లో నమోదుచేసే సమయంలో కొందరు రెండు చోట్ల నమోదు చేసుకున్నట్లు సమాచారం. అందు కే డబ్లింగ్ లేకుండా పకడ్బందీగా కులగణనను చేపట్టేందుకు కూడా సిబ్బంది క్రాస్ చెక్ చేసుకుంటున్నారు.