బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేష్...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బాల్య వివాహాలపై నిఘా పెంచాలని బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాల రక్షభవన్ లో శనివారం జిల్లా బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జిల్లాలో వివాహాల సీజన్ మొదలైనందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, బాల్య వివాహాలు జరగకుండా గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామస్థాయి బాలల సంరక్షణ కమిటీలను బలోపేతం చేసి అన్ని శాఖల సమన్వయంతో జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. బాల్యం చాలా విలువైనదని దాన్ని ఎవరు కూడా వృధా చేయడానికి వీలు లేదని వారికి స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని కల్పించాలని బాల్యాన్ని బంధి చేసి వారి హక్కులకు భంగం కలిగించి బాల్య వివాహాలు జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాల రక్ష భవన్ సిబ్బంది శ్రవణ్ కుమార్, శ్రీనివాస్ బాల ప్రవీణ్ కుమార్, డి.ప్రవీణ్ కుమార్, జమున, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.