- గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు
- 25 వేల మంది పోలీసులతో బందోబస్తు
- రూట్ మ్యాప్ పరిశీలించిన డీజీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్, కలెక్టర్, సీపీలు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ఈ నెల 17న జరగబోయే గణేశ్ నిమజ్జనం శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని, సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచామని తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. శనివారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, హైదరాబాద్, రాచకొండ సీపీలు సీవీ ఆనంద్, సుధీర్‌బాబుతో కలిసి డీజీపీ జితేందర్ బాలాపూర్ విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు.
అనంతరం గణేశ్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో బాలాపూర్ నుంచి చాంద్రా యణగుట్ట, ఫలక్‌నుమా, లాల్‌దర్వాజ, చార్మినార్, నయాపూల్, ఎంజే మార్కెట్, బషీర్‌బాగ్, ట్యాంక్‌బండ్ వరకు రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. గణేష్ శోభాయాత్ర రోజు జంట నగరాల్లో 25 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
అదనంగా క్రేన్లు..
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. నిమజ్జనానికి సంబంధించి గ్రేటర్ పరిధిలో అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. గతం కంటే 15 శాతం ఎక్కువ విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నందున అదనపు క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మున్సిపల్ సర్కిల్‌లో నీరు, ఆహారం అందించబోతున్నట్లు చెప్పారు. ఆర్డీవోలు మహిపాల్‌రెడ్డి, దశరథ్‌సింగ్, జోనల్ సర్కిల్ కమిషనర్లు వెంకన్న, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.