calender_icon.png 23 September, 2024 | 2:01 PM

బోట్‌లో నిఘా సమాచారం!

23-09-2024 02:19:25 AM

అప్రమత్తమైన ఇటలీ ప్రభుత్వం

రోమ్, సెప్టెంబర్ 22: సిసిలీ వద్ద సముద్రంలో బోల్తాపడిన బేజియన్ అనే విలాసవంతమైన సూపర్ యాట్ సెయిల్ బోట్ ఇటలీని భయపెట్టిస్తోంది. అటానమీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మైక్ లించ్ విందు చేసుకున్న ఈ నౌక వాటర్‌ప్రూఫ్ సేఫ్ లాకర్స్‌లో సీక్రెట్ ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నట్లు రోమ్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నౌక శకలాలు ఉన్నచోట డైవర్ల బృందంతో అదనపు భద్రతను కల్పించాలని సిసిలీని కోరింది. బోట్‌లో ఉన్న సీక్రెట్ సమాచారాన్ని చైనా, రష్యా ప్రభుత్వాలు దొంగిలించే ప్రయత్నం చేయొచ్చని భావిస్తోంది. మైక్ లించ్ సంస్థలు పలు ఇంటెలిజెన్స్ సర్వీసులతో కలిసి అమెరికా, బ్రిటన్ దేశాలకు సేవలు అందిస్తున్నాయి.

ముఖ్యంగా లించ్ నిర్వహించే డార్క్ ట్రేస్ సైబర్ సెక్యూరిటీ సంస్థ కీలక సమాచారాన్ని సేకరిస్తుంటుంది.  లించ్ ప్రయాణిస్తున్న బేజియన్ బోట్‌లో వాటర్ టైట్ సేఫ్‌లలో రెండు సూపర్ ఎన్‌క్రిప్టెడ్ హార్డ్ డ్రైవ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో అత్యంత రహస్య సమాచారమున్నట్లు కొందరు రికవరీ ఆఫీసర్లు అమెరికా వార్త సంస్థ సీఎన్‌ఎన్‌కు వెల్లడించారు. ప్రస్తుతం ఈ నౌక శకలాలు సిసిలీలో సముద్రజలాల్లో 50 మీటర్ల అడుగున పడిఉన్నాయి. కాగా గత నెల జరిగిన ఈ సముద్ర ప్రమాదంలో మైక్‌లించ్‌తో పాటు మోర్గాన్ ఇంటర్నేషనల్ చైర్మన్ జోనాథన్ బ్లూమర్, ఆయన సతీమణి, క్లిఫ్‌ఫోర్డ్ ఛాన్స్ లాయర్ క్రిస్ మోరవిల్లో మరణించారు.