01-03-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 28(విజయ క్రాంతి): సాధారణ దొంగతనాల నుండి ఉగ్రవాద కదలికల గుట్టు రట్టు చేసి దోషులకు శిక్షలు పడేందుకు దోహదపడే నిఘా నేత్రాలు.. నిర్లక్ష్య నీడలో కునారిల్లుతున్నాయి. నిర్వహణ లోపాలు, నిర్లక్ష్యం కారణంగా సరిగా పనిచేయక అలంకార ప్రాయంగా మారుతున్నాయి. అయినా అటు ఆయా కాలనీల అసోసియేషన్లు కానీ ఇటు పోలీసులు కానీ సరైన శ్రద్ధ చూపక పోవడంతో చాలా చోట్ల మూడో కన్ను మూలన పడిపోయాయి.
జనసంచారం అధికంగా ఉండే చోట్ల, ముఖ్యమైన కూడళ్లలో కూడా సీసీ కెమెరాలు నిర్వహణ లోపాలతో అలంకార ప్రాయంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సీసీ కెమెరాలు ఎంతో ప్రాధాణ్యతను సంచరించుకున్నాయి. ఒక్క సీసీ కెమెరా 100 పోలీసులతో సమానం. సాధారణ దొంగతనాల నుండి ఉగ్రవాద కదలికల గుట్టు వరకు గుట్టురట్టు చేయగల నిఘా నేత్రాలు సీసీ కెమెరాలు. విశ్వనగరం లక్ష్యంగా దూసుకుపోతున్న హైదరాబాద్ నగరంలో ప్రజల భద్రతలో కీలకమైన పాత్ర పోషించే నిఘా నేత్రాలు నిర్లక్ష్యపు మబ్బులు కమ్మేయడంతో నిద్రలోకి జారుకున్నాయి.
నగరంలో సీసీ కెమెరాలపై సరైన పర్యవేక్షణకరువై, నిర్వహణ లోపంతో వేలాది కెమెరాలు పనిచేయని దుస్థితి నెలకొంది. శాంతిభద్రతల విషయంలో హైదరాబాద్ నగరాన్ని అత్యున్నత స్థానంలో నిలపడంలో సీసీ కెమెరాలదే ప్రధాన పాత్ర, ఇక పెద్ద పెద్ద నేరాలు, కిడ్నాపులు, మరర్లవంటి సంఘటనలను కేవలం గంటల వ్యవధిలోనే చేదించడంలో పోలీసులు సీసీ కెమెరాల మీదనే ఆధారపడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు.
అలాగే అంతరాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించడంలోను సీసీ కెమెరాల ఫుటేజ్ సమాచారం కీలకంగా మారుతుంది. శాంతిభద్రతలు, ట్రాఫిక్, నేర పరిశోధనకు సాంకేతిక పరిజ్ఞానం పైనే ఆధారపడుతుండడంతో గత కొన్నేళ్ళుగా కార్పొరేట్ సామాజిక బాధ్యత, ఎమ్మెల్యే, ఎంపీ నిధులు, సేఫ్సిటీ ప్రాజెక్టు, నేనుసైతం వంటి కార్యక్రమాలతో సీసీ కెమెరాలపై విస్తృత అవగాహన కల్పించడంతో అపార్ట్మెంట్లు, దుకాణదారులు వ్యాపారులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాలతో పాటు వ్యక్తిగతంగా వేలాది సీసీ, కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
సీసీటీవీ కెమెరాల పాత్ర కీలకం..
ప్రస్తుతం నగరంలో ఉన్న సీసీ కెమెరాలలో కేవలం సగం కూడా పనిచేయడం లేదని సమాచారం. దీంతో ప్రధాన కూడళ్లలో, కీలకమైన మలుపుల్లో నేర ఘటనలు జరిగినప్పుడు తగిన సాక్ష్యాధారాలు లభించక పోవడంతో కేసుల విచారణ నత్తనడకన నడుస్తుందని తెలుస్తుంది.
సీసీ కెమెరాలు ఉన్నచోట ఏ ఘటన జరిగినా ఘంటల వ్యవధిలోనే నేరాగాళ్లను పట్టుకుంటున్నారు పోలీసులు. అటు శాంతిభద్రతలు, ఇతర నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తున్నాయి.
సీసీ కెమెరాలు పని చేయడం లేదు..!
ప్రపంచంలోనే అధికంగా సీసీ కెమెరాలు ఉన్న అతిపెద్ద రెండో నగరం హైదరాబాద్ నగరమే కావడం విశేషం. ఇక్కడ ప్రతి వెయ్యిమంది ప్రజలకు 30 సీసీ కెమెరాలు ఉండేలా ఏర్పాటు చేయడంతో పాటు చదరపు కిలోమీటర్ కు 480 సీసీ కెమెరాలు ఉన్నాయంటే నగరంలో శాంతిభద్రతలు కాపాడటంలో సీసీ కెమెరాలు ఎంత కీలకంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం చాలా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుస్తుంది.
వాటి మరమ్మతులు చేయించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం దురదృష్టకరం, ప్రధాన సర్కిళ్లతో పాటు చాలా ప్రాంతాలలో 50 శాతం సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులే చెబుతుండడం విస్మయానికి గురిచేస్తుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణలో కీలకంగా మారిన సీసీ కెమెరాల పనితీరును మెరుగుపర్చాలని ప్రజలు కోరుతున్నారు.