calender_icon.png 30 September, 2024 | 5:53 PM

సరోగసీతో సంతానం పొందినా సెలవులు

28-09-2024 01:39:08 AM

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

భువనేశ్వర్, సెప్టెంబర్ 27: సరోగసీ విధానంలో పిల్లలను పొందాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ విధానంలో సంతానం పొందిన ఉద్యోగినులకు 6 నెలల ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా ఉద్యోగులకు 180 రోజులు, పురుష సిబ్బందికి 15 రోజుల సెలవులు తీసుకునే వెసులుబాటు కల్పించారు.

సరోగసీ కోసం గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ సైతం ప్రభుత్వ ఉద్యోగిని అయితే ఆమెకు సైతం ఈ సెలువులు వర్తిస్తాయి. కాగా ఇద్దరు సంతానం వరకే ఈ అవకాశాన్ని కల్పించారు. సెలవులు పొందేందుకు రిజిస్టర్డ్ వైద్యులు లేక ఆసుపత్రుల నుంచి సరోగసీ తల్లి, కమిషనింగ్ తల్లీదండ్రి మధ్య ఉన్న ఒప్పందాన్ని సమర్పించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వివాహమై 5 ఏండ్లు గడిచినా పిల్లలు కాని వారు సరోగసీకి అర్హులు.

మహిళకు 23  50 ఏళ్లు, పురుషునికి 26 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. సాధారణ పద్ధతుల్లో సంతానం కలగని పరిస్థితుల్లోనే సరోగసీ విధానంలో బిడ్డను పొందొచ్చు. కాగా సరోగసీ విధానంలో సంతానం పొందేవారికి మాతృత్వ, పితృత్వ సెలవుల ప్రయోజనాలను కొన్ని నెలల క్రితం కేంద్రం పొడిగించిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది.