23-04-2025 01:01:38 AM
ప్రభుత్వాసుపత్రిలో 24 గంటల్లో సర్జరీ, వైద్యుల పనితీరుపై ప్రశంసలు
జనగామ, ఏప్రిల్ 22: ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే చాలా మందికి అనేక అపోహాలు ఉంటాయి. సరైన వైద్య సేవలు అందవనే భావనలో ఎక్కువ శాతం ప్రజలు ఉంటుంటారు.. కానీ ఆ అపోహాలు తొలగించేలా జనగామ జిల్లా ఆస్పత్రిలో వైద్యులు కృషి చేస్తున్నారు.
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే నానుడిని తొలగిస్తూ నేను పోతా బిడ్డ సర్కారు ఆస్పత్రికి అనేలా నమ్మకం కలిగిస్తున్నారు. ఇందుకు తాజాగా ఓ వృద్ధురాలికి అందిన వైద్యమే నిదర్శనం. ఏకంగా సర్జరీ చేసి 24 గంటల్లో సురక్షితంగా వృద్ధురాలిని డిశ్చార్జీ చేయడం జనగామ వైద్యరంగంలో సంచలనంగా మారింది. వివరాల్లోకెలితే.. జనగామ పట్టణానికి చెందిన సౌడ సిద్ధమ్మ(75) అనే వృద్ధురాలు నాలుగు రోజుల క్రితం ఇంట్లో జారిపడడంతో ఆమె తొంటి విరిగింది.
దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సిద్ధమ్మను పరీక్షించిన వైద్యులు సర్జరీ చేయాల్సి ఉందని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీనికోసం ప్రైవేటు ఆస్పత్రిలో సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యులు తాము సురక్షితంగా ఆపరేషన్ చేస్తామని, పైసా ఖర్చు అవసరం లేదని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన 24 గంటల్లో సిద్ధమ్మకు సర్జరీ పూర్తి చేశారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాల్‌రావు పర్యవేక్షణలో వైద్యులు విశ్వనాథ్, వేణుగోపాల్, మాచర్ల భిక్షపతి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజుల అనంతరం మంగళవారం ఆమెను సురక్షితంగా డిశ్చార్జీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పైసా ఖర్చు లేకుండా ఇలాంటి పెద్ద ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి వృద్ధురాలిని కాపాడడంపై ఆమె కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.