calender_icon.png 14 November, 2024 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురేశే ప్రధాన నిందితుడు

13-11-2024 12:00:00 AM

  1. పక్కా ప్లాన్‌తోనే లగచర్లలో భౌతికదాడులు
  2. దాడి చేసిన వారితో పాటు ఉసిగొల్పిన వారినీ వదలిపెట్టం
  3. అవసరమైతే రంగంలోకి ప్రత్యేక బృందాలు
  4. మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ

వికారాబాద్, నవంబర్ 1౨ (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో సోమవారం కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో పాటు ఇతర అధికారులపై భౌతికదాడి వెను క బీఆర్‌ఎస్ నేత బోగమోని సురేశే ప్రధాన నిందితుడని తెలంగాణ మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ వెల్లడించారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పక్కా ప్రణాళికతోనే దాడులకు కుట్ర జరిగిందని వెల్లడించారు. దాడులు చేయాలనుకున్న వారు ముందుగానే కారం, కర్రలు, రాళ్లను సిద్ధం చేసుకున్నారని వివరించారు. దాడిలో మొత్తం 100 -110 మంది పాల్గొన్నారని గుర్తించామన్నారు. లగచర్ల  గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఫార్మా సిటీపై ప్రజాభిప్రాయ సేకరణ శిబిరం ఏర్పాటైందన్నారు.

అధికారులను గ్రామం లోకి వెళ్లొద్దని ప్రభుత్వ అధికారులకు పోలీసులు ముందుగానే హెచ్చరించారని స్పష్టం చేశారు. కానీ.. అధికారులు ధైర్యంగా గ్రామంలోకి వెళ్లారని తెలిపారు. ఈ క్రమంలోనే కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో పాటు కడా ప్రత్యేకాధికారి వెంకటరెడ్డిపై దాడులు జరిగాయన్నారు. గ్రామస్థులు దాడులకు పాల్పడతా రని పోలీసులు ఊహించలేదన్నారు. తాము పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించామన్నారు. తాము గ్రామస్థులపై లాఠీచార్జికి సైతం దిగలేదని వెల్లడించారు.

దాడులతో ప్రమే యం ఉన్న వారితో పాటు, వారిని ఉసిగొల్పిన వారినీ విడిచిపెట్టమని తేల్చిచెప్పారు. ఇప్పటికే దాడులపై లోతైన విచారణ కొనసాగుతుందన్నారు.   విచారణకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, ఇంకా అవసరమైతే ప్రత్యేక బృందాలను సైతం నియమిస్తామని స్పష్టం చేశారు. ఆధారాలు సేకరించి, నిందితులకు శిక్ష పడే విధంగా విచారణ చేపడతామన్నారు.