లగచర్ల కేసులో అరెస్టున రైతుల కుటుంబీకులు
వికారాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): ‘బీఆర్‌ఎస్ నేత సురేశ్‌కు మా ఊరిలో భూమి లేదు. ఆయనే దాడులకు ఉసిగొల్పి మా ఊరోళ్లను నాశనం చేశాడ’ని లగచర్ల కేసులో అరెస్టున రైతుల కుటుంబీకులు గోడు వెళ్లబోసుకున్నారు. రైతులతో ములాఖత్ అయ్యేందుకు గురువారం పరిగి సబ్ జైలుకు వెళ్లిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో వారి బాధను వెలిబుచ్చారు.
సురేశ్‌పై చిన్నతనంలోనే లైంగిక దాడి కేసు ఉందని, తర్వాత కూడా సురేశ్ హైదరాబాద్‌కు వెళ్లిపోయాడన్నారు. సురేశ్‌కు తమ గ్రామస్తులకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. సురేశ్ తమ ఇంటి మగవాళ్లను బలిపశువులను చేశాడని వాపోయారు.
రైతుల పట్ల దుర్మార్గ వైఖరి: సబిత
లగచర్ల రైతుల పట్ల రాష్ట్రప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. గురువారం ఆమె ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, మహేశ్‌రెడ్డి, హరిప్రియతో కలిసి పరిగి సబ్ జైలులో రైతులతో ములాఖత్ అయ్యారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.
- నిర్వాసిత రైతులకు బీఆర్‌ఎస్ నాయకులు అండగా నిలబడినందుకే ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని జైలుకు పంపించారని దుయ్యబట్టారు. రైతులు, ప్రజల తరఫున కొట్లాడేందుకు సిద్ధమైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా ఏదో ఒక విధంగా జైలుకు పంపాలని కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.