18-03-2025 01:17:15 AM
చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరుపెట్టాలని కేంద్రానికి లేఖ
ప్రకృతి చికిత్సాలయానికి మాజీ సీఎం రోశయ్య పేరు పెడతాం
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయానికి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతున్న ట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుతో యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనాప రమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని, అందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ ముఖ్య మంత్రి లేఖ రాశారు. నేచర్ క్యూర్ హాస్పిటల్‌కు మాజీ సీఎం రోశ య్య పేరును పెట్టడమే కాకుండా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.
సోమవారం తెలు గు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదిస్తూ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలోనూ, మండ లిలోనూ బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఈసందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలు కలుషి తమయ్యాయో, నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదని, కొందరు కావాలని కులం ప్రస్తావన తీసుకొస్తున్నారన్నారు.
పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా చూడటంలేదని, ప్రాణత్యాగాన్ని గుర్తించి అందరూ స్మరించుకోవాలన్నారు. రాష్ర్ట ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లను వర్సిటీలు, సంస్థలకు పెట్టుకుంటున్నామని, రాష్ర్ట పునర్విభజన తర్వాత గత పదేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కొన్ని వర్గాలకు కొందరు అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్ర పదవుల్లో ఉన్నవా రు కూడా ఇలా చేయడం సమంజసం కాద ని హితవు పలికారు.
గతంలోనూ పేర్లు మార్చుకున్నాం..
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నామని, ఇది ఎన్టీఆర్‌ను అగౌరవపరిచినట్టు కాదని, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నామని, వైఎస్ పేరుతో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి తెలంగాణ ఏర్పడ్డాక కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుపెట్టుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరును పెట్టుకున్నామని, ఇందులో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకున్నట్లు చెప్పారు.
వ్యక్తులను అగౌరవపరిచేందుకు కాదు..
వ్యక్తులను అగౌరవపరిచేందుకు తాము పేర్లు మార్చడంలేదని సీఎం స్పష్టం చేశారు. విశాల ప్రయోజనాల కోసం రాష్ర్ట ప్రభు త్వం తీసుకుంటున్న నిర్ణయాలకు, బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు కులా న్ని ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియం పేరు తొలగించి ప్రధాని మోదీ పేరు పెట్టారని, తాము అలాంటి తప్పిదాలు చేయలేదు.. చేయబోమన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామని, చిత్తశుద్ధి ఉంటే కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలని కోరారు.
స్ఫూర్తి ప్రదాత.. సురవరం
సురవరం ప్రతాపరెడ్డి గొప్ప వైతాళికుడు అని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. తెలుగు యూని వర్సిటీకి సురవరం పేరు ఎప్పుడో పెట్టాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లును మండలి ఆమోదించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సురవరం పేరు పెట్టడం అంటే పొట్టి శ్రీరాములను అవమానించడం కాదన్నారు.
తెలంగాణలోనూ ఆయన్ను కూడా గౌరవించుకుంటామన్నారు. పొట్టి శ్రీరాములు పేరుతో ఏపీలో యూనివర్సిటీని అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిందని చెప్పారు. కాగా, తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరుపెట్టడంపై ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ర్ట విభజన తర్వాత కూడా శ్రీరాములు పేరుతో యూనివర్సిటీ కొనసాగించాల్సిన అవసరం లేదని కోదండరాం అన్నారు.
తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం సముచితమేనని, ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు మహేశ్‌కుమా ర్‌గౌడ్ పేర్కొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేశారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. భాషా ప్రాతిపదికన యూనివర్సిటీ ఏర్పడిందని, దానికి సురవరం పేరు సబబే అని అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. అనంతరం చైర్మన్ బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.
-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
‘సురవరం’పేరు సముచితమే
తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు ప్రతిపాదనకు తన మద్దతును సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..సురవరం ప్రతాపరెడ్డి తొలి వైతాళి కుడని కొనియాడారు. కులంపై సభలో చర్చలొద్దని సూచించారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గౌరవిస్తామని చెప్పా రు. తెలంగాణలో కవులే లేరంటూ నాడు ఎద్దేవా చేస్తే గోల్కొండ పత్రికను కవుల రచనలతో నడిపారని ఆయన గుర్తు చేశారు.
-సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
‘ఓయూ’కు సురవరం పేరుపెట్టాలి
నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టుకోవాలని అధికార పార్టీకి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు. అసెంబ్లీలో మం త్రి దామోదర రాజనర్సింహ బిల్లు ప్ర వేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చ లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడు తూ.. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి న సురవరం పేరును ఉస్మానియా వర్సిటీకి పెట్టడమే సముచితమన్నా రు. కానీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చొద్దని సూచించారు.
-బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసినట్టే..
పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు అవివేకమైన చర్య బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ విమర్శించారు. పొట్టి శ్రీరాములు ఒక ప్రాంతానికి చెందిన నేత కాదని, అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి అన్నారు. సీఎం చెప్పినట్టు పొట్టి శ్రీరాములు వర్సిటీ లేదని, పొట్టి శ్రీరాములు పేరుతో దేశంలో ఎక్కడా వర్సిటీ లేదని పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల ఆరాధ్యనేత పొట్టి శ్రీరాములు అని, ఆయన పేరును తొలగించినట్టయితే ఆ వర్గాల మనోభావాలను దెబ్బతీసినట్టేనని చెప్పారు. ఆయన పేరును తొలగిస్తే ఉద్యమం తప్పదు అని హెచ్చరించారు.
-బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
పొట్టి శ్రీరాములు పేరు పెట్టండి
చర్లపల్లి రైల్వే టెర్మినల్ పేరును పొట్టి శ్రీరాములు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌గా మార్చాలని కోరుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం లేఖ రాశారు.
-రైల్వేమంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ