calender_icon.png 25 December, 2024 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు జాతి వెలుగు సురవరం

25-08-2024 12:00:00 AM

నేడు సురవరం ప్రతాపరెడ్డి వర్ధంతి :

న్యాయవాదిగా  జీవితం ప్రారంభించి, రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా సాగించి తెలంగాణ ప్రజల హృదయాలలో ముద్రవేసుకున్నాడు.   ప్రతాపరెడ్డి భావుకుడైన రచయిత. కవితలు, కథలు, వ్యాసాలు రచించారు.ఆయన రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడమే కాకుండా ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంసలు పొందింది. 

తెలుగు జాతికి వరం సురవరం. తెలుగు భాషాసంస్కృతుల వికాసానికి కృషి చేసిన మహ నీయుడు. సురవరం అంటేనే ఒక వెలుగు.ఆయన తెలంగాణకు ఒక వరం.చరిత్ర ఉన్నంత కాలం ఆయన పేరు ప్రతి ఒక్కరిలో మార్మోగుతూనే ఉంటుంది. తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యానికి మారు పేరు సురవరం.  పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి ఎనలేనిది.

తెలంగాణలో కవులే లేరనేవిమర్శలను వమ్ము చేస్తూ 354 కవులతో కూడిన ‘గోల్కొండ కవుల సంచిక’ గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికు డు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక  నూతన అ ధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భా షలలో గట్టి పట్టు సాధించారు. ‘గోలకొండ’ పత్రిక, దాని కి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిం దువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమం ఆయన ఇతర ముఖ్య రచనలు.

నైజాం నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశారు. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలకు గుర్తిం పుగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పై ప్రతిష్ఠించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొం దింది. 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను ‘కేంద్ర సాహిత్య అకాడమీ’ అవార్డు లభించింది.

విద్యాలయంగా రెడ్డి హాస్టల్

సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో రంగమ్మ, నారాయణరెడ్డి దంపతులకు జన్మించాడు. ప్రతాపరెడ్డి తండ్రి చిన్నతనం లోనే మరణించారు. అతను చిన్నాన్న రామకృష్ణారెడ్డి వద్ద పెరిగి  మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను, హైదరాబాద్ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్, మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బీఏ చదివారు. సురవరం ప్రతాపరెడ్డి తన చదువు పూర్తికాగానే హైదరాబాద్ కొత్వాల్‌గా వున్న రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలోని రెడ్డి హాస్టల్‌కు ఆయన కోరికపై వచ్చారు.

ఇక్కడ ఆయన పనిచేసిన దశాబ్ది కాలంలో రెడ్డి హాస్టల్‌ను ఒక విద్యాలయంగా తీర్చిదిద్దారు. ఆ విధంగా హైదరాబాద్‌లో రెడ్డి సాంఘిక సేవా జీవితం పునాదులు వేసింది. మద్రాస్ కళాశాలలో చదువుతున్నప్పుడే నాటి జాతీయ ఉద్యమ ప్రభావం ఆయనపై పడింది. హాస్టల్ కార్యదర్శిగా వచ్చాక, వేయి గ్రంథాలున్న హాస్టల్ లైబ్రరీని 11వేల గ్రంథాల వరకు పెంచి, విద్యార్థులలో భాషాభివృద్ధికి కృషి చేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బీఏ, తిరువాన్కూరులో బీఎల్ చదివారు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించారు. అనేక భాషలు అభ్యసించారు.

గ్రంథాలయోద్యమంలో ప్రముఖ పాత్ర

1926లో ఆయన నెలకొల్పిన ‘గోలకొండ’ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. ఆ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టారు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించారు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది. తెలంగాణాలో గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖ పాత్ర వహించారు. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించారు.

1943లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు, 1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సమావేశాలకు ఆయన అధ్యక్షుడు.1951లో ‘ప్రజావాణి’ అనే పత్రికను ప్రారంభించాడు. 1952లో హైదరాబాద్ రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరఫున వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. న్యాయవాదిగా  జీవితం ప్రారంభించి, రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా సాగించి తెలంగాణ ప్రజల హృదయాలలో ముద్రవేసుకున్నారు.   ప్రతాపరెడ్డి భావుకుడైన రచయిత. కవితలు, కథలు, వ్యాసాలు రచించారు.

ఆయన రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడమే కాకుండా ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంసలు పొందింది. సురవరం ప్రతాపరెడ్డి కథలు నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించాయి. హైందవ ధర్మ వీరులు, హిందువుల పండుగలు, రామాయణ కాలం నాటి విశేషాలు మొదలైన ఇతర గ్రంథాలను రచించారు. భక్త తుకారాం, ఉచ్ఛల విషాదము అనే నాటకాలు రాశారు. ఇతను రాసిన కథలు ‘మొగలాయీ కథలు’ పేరుతో రెండు భాగాలుగా వెలువడ్డాయి. వీటిని అణా గ్రంథమాల 1940లో అచ్చువేసింది. రాజకీయ సాంఘిక ఉద్యమంగా సంచలనం కలిగించిన ఆంధ్రమహాసభ మొట్టమొదటి అధ్యక్షుడు ప్రతాపరెడ్డి.

తొలి శాసన సభకు ఎన్నిక

సురవరానికి రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోయినా సన్నిహితుల ప్రోద్బలంతో 1952లో జరిగిన తొలి ఎన్నికలలో వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రముఖ న్యాయవాది వి.రామచంద్రారెడ్డి పై విజ యం సాధించి హైదరాబాద్ శాసనసభకు ఎన్నికయ్యా రు. కానీ ప్రారంభం నుంచి రాజకీయాలకు దూరంగా ఉండటం, గ్రూపు రాజకీయాలు చేయకపోవడంతో జిల్లా వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈయనకు మంత్రిపదవి కూడా లభించలేదు.

ఈ విషయంపై సురవరం స్వయంగా తనకు ఆప్తుడైన రంగాచార్యులకు లేఖ రాస్తూ ‘ఈ రాజకీయపు చీకటి బజారులో నేను, నా వంటివారు ఏమియును పనికి రారు’ అని స్పష్టంగా పేర్కొన్నారు. సురవరం1953 ఆగస్ట్ 25న మరణించారు. వీరి రచనల ద్వారా ప్రతి ఒక్కరు స్పూర్తిని పొందాలి. పాత్రికేయులు,పత్రికా యాజమాన్యాలు ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి.ప్రతి జిల్లా కేంద్రంలో సురవరం కాంస్య విగ్రహాన్నిఏర్పాటు చేయాలి.ఆయన జన్మించిన జిల్లాకు సురవరం ప్రతాపరెడ్డి జిల్లా గా నామకరణం చేయాలి. ఈ సందర్బంగా స్మరించుకుందాం.

 కామిడి సతీష్ రెడ్డ్డి