calender_icon.png 18 November, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుల్డోజర్‌కు సుప్రీం బ్రేకులు

03-09-2024 12:09:17 AM

  1. ప్రభుత్వాల తీరుపై అసహనం
  2. నేరం చేస్తే ఆస్తులను ఎలా కూలుస్తారని ప్రశ్న
  3. చట్ట ప్రకారమే శిక్షను అమలు చేయాలని సూచన
  4. అక్రమ కట్టడాలైతే నోటీసులు ఇవ్వాలని ఆదేశం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆస్తులను అలా ఎలా కూలుస్తారని ప్రభుత్వాలను ప్రశ్నించింది. దోషిగా తేలినా ఆస్తులను ధ్వంసం చేయకూడదని స్పష్టం చేసింది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న బుల్డోజర్ జస్టిస్ కల్చర్‌పై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లపైకి కొన్ని రోజులుగా బుల్డోజర్లను పంపిస్తున్న ఘటనలు వివాదాస్పదంగా మారాయి.

ఈ  నేపథ్యంలో బుల్డోజర్ కల్చర్‌పై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖల య్యాయి. ఇలాంటి కూల్చివేత చర్యలను అడ్డుకోవాలని పిటిషనర్లు కోరారు. వీటిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ నిందితుల ఇళ్లు, ఇతర స్థిరాస్తులను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. 

చట్టం ప్రకారమే వెళ్లాలి కదా..

దేశవ్యాప్తంగా బుల్డోజర్ సంస్కృతి వ్యాపి ంచకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఢిల్లీ జహంగీర్‌పురిలో కూల్చివేతలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పైనా న్యాయవాదులు వాదనలు వినిపించారు. కొన్ని సందర్భాల్లో అద్దెకు తీసుకు న్న ఆస్తులను ధ్వంసం చేశారని ఆరోపించారు. దవే వాదనల మధ్య జోక్యం చేసుకున్న ప్రభుత్వ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ విషయంలో సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఏదైనా కేసులో ఒక వ్యక్తి నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఆ కారణంతో అతని స్థిరాస్తి కూల్చివేతకు సిద్ధపడుతారా? ఒకవేళ సదరు వ్యక్తి దోషిగా తేలినా చట్టం నిర్ణయించిన పద్ధతిలో కాకుండా అతని ఆస్తిని ఎలా ధ్వంసం చేస్తారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నకు తుషార్ మెహతా సమాధానమిస్తూ.. నిందితుడిగా ఉన్నంత మాత్రన ఏ వ్యక్తి ఆస్తిని కూల్చివేయట్లేదు. వారివి అక్రమ కట్టడం అయితేనే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం అని వివరించారు. 

మార్గదర్శకాలు లేకుండా ఎలా?

ప్రభుత్వ తరఫు వాదనలు విన్న తర్వాత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా రాజస్థాన్‌లో జరిగిన ఓ ఘటనను ఉదహరించారు జస్టిస్ విశ్వనాథన్. ఉదయ్‌పూర్‌లో ఓ విద్యార్థి తన క్లాస్‌మేట్‌ను పొడిస్తే అతని ఇంటిని కూల్చివేశారు. ఓ వ్యక్తి కుమారుడు తప్పు చేస్తే ఇంటిని కూల్చివేయడం సరైనది కాదు. అక్రమంగా కట్టిన నిర్మాణమైతే తప్పులేదు. ప్రజా రవాణా, రహదారులకు అడ్డంకిగా ఉండే అక్రమ కట్టడాలను మేం రక్షించడం లేదు.

కానీ నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్తులను కూల్చుతున్నట్టయితే అందుకు దేశవ్యాప్తంగా ప్రాథమిక మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంటుంది. వాటిని డాక్యుమెంట్ చేయాలి. ముందుగా నోటీసులు ఇచ్చి సమాధానాలు తెలుసుకుని న్యాయవ్యవస్థను సంప్రదించాలి. మీరు దీనికి కట్టుబడి ఉంటే అప్పుడే ఇలాంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే వీలుంటుంది. ఇరుపక్షాలు తమ సూచనలు తెలియజేయవచ్చు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం అని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.