calender_icon.png 6 November, 2024 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆప్ ప్రభుత్వానికి సుప్రీం షాక్

06-08-2024 02:22:32 AM

ఎంసీడీ సభ్యులను నామినేట్ చేసే అధికారం ఎల్జీకి ఉంటుందని తీర్పు

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఢిల్లీలోని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఎల్జీకి ఈ అధికారాలు ఉంటాయని తేల్చిచెప్పింది.

అయితే ఎంసీడీలో 10 మంది కౌన్సిలర్లను మంత్రిమండలి సలహాతో నామినేట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఎల్జీకి ఢిల్లీ ప్రభుత్వ సలహాలు పాటించాల్సిన అవసరం లేదని, ఇది చట్టబద్ధమైన అధికారమని స్పష్టం చేసింది.

కాగా 2022లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ 250 వార్డుల్లో 134 స్థానాల్లో విజయఢంకా మోగించింది. అయితే ఆ సమయంలో ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్లను ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు.

దీన్ని వ్యతిరేకిస్తూ ఆప్ ప్రభుత్వం ఎల్జీకి కౌన్సిలర్లను నియమించే అధికారం లేదని, నామినేటెట్ కౌన్సిలర్లను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసుపై పూర్తి వాదనలు విన్న అనంతరం తాజాగా సుప్రీంకోర్టు ఎల్జీకి అనుకూలంగా తీర్పునిచ్చింది.