calender_icon.png 28 September, 2024 | 4:55 PM

టెల్కోలకు సుప్రీం షాక్

20-09-2024 12:00:00 AM

ఏజీఆర్ బకాయిల్ని తిరిగి లెక్కించాలన్న పిటిషన్ కొట్టివేత

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: తమ అడ్జస్టడ్ గ్రాస్ రెవిన్యూ (ఏజీఆర్) బకాయిల్ని టెలి కాం శాఖ తిరిగి లెక్కించాలంటూ ఆదేశాలివ్వాలని కోరుతూ టెలికా కంపెనీలు వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్‌లు దాఖలు చేసిన పిటిషన్లను గురువారం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఏజీఆర్ బకాయిలపై టెలికాం శాఖ లేవనెత్తిన డిమాండ్ ఫైనల్ అని, వాటిని తిరిగి లెక్కించాల్సిన పనిలేదని సుప్రీం కోర్టు పేర్కొంది.

వొడాపోన్ ఐడి యా మొత్తం బకాయిలు రూ.58,354 కోట్లుకాగా, భారతి ఎయిర్‌టెల్‌వి రూ.43,980 కోట్లు. తాజా తీర్పుతో వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన బకాయిల భారం రూ.70,320 కోట్లకు పెరుగుతుంది. ఇప్పటికే భారతి ఎయిర్‌టెల్ కొంతమేర బకాయిల్ని చెల్లించివేసింది. ఐడియా చెల్లించాల్సిన దానిలో కొంత భాగానికి బదులుగా ఆ కంపెనీలో కేంద్ర ప్రభుత్వం వాటా తీసుకున్నది. తీర్పు ప్రభావంతో వొడాఫోన్ ఐడియా షేరు గురువారం 20 శాతం పతనమై రూ.11 వద్దకు పడిపోయింది. 

ఏజీఆర్ కేసు నేపథ్యం

లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజ్ చార్జీల చెల్లింపులో భాగంగా టెలికాం సర్వీసుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం, టెలికాం కంపెనీలు పంచుకోవాలి. టెలికాం కంపెనీలు వాటి స్థూల ఆదాయంలో చెల్లించాల్సినవి  15 ఏండ్లుగా ప్రభుత్వానికి బకా యిపడ్డాయి. వాటిని చెల్లించాలంటూ  గతంలో టెలికాం శాఖ ఆయా కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై కంపెనీలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా రూ.1.5 లక్షల కోట్ల మేర ఏజీఆర్ బకాయిలు, వాటిపై వడ్డీని చెల్లించాల్సిందే నంటూ 2019లో తీర్పునిచ్చింది.

ఈ బకాయిల్ని పదేండ్లలో వాయిదాలుగా కట్టే అవకాశాన్ని కల్పించారు. అయితే తమ స్థూల ఆదాయాన్ని గణించడంలో పలు పొరపాట్లు దొర్లాయని ఆరోపిస్తూ దానిని తిరిగి లెక్కించి తమ బకాయిల్ని తగ్గించాలంటూ వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్‌లు గతంలో వేర్వేరుగా  దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లపై సుప్రీం కోర్టు ధర్మాసనం తాజాగా తీర్పునిచ్చింది.